ఆషాఢ మాసము లేబుల్‌తో ఉన్న పోస్ట్‌లను చూపుతోంది. అన్ని పోస్ట్‌లు చూపించు
ఆషాఢ మాసము లేబుల్‌తో ఉన్న పోస్ట్‌లను చూపుతోంది. అన్ని పోస్ట్‌లు చూపించు

నాగుల చవితి


పాముని చూడగా బెదిరి పాకిన చోటన మంత్ర అక్షతల్

భూమిని చల్లగా విషము పోవును లొంగును భక్తికిన్‌ మరిం

పాములు దుష్ట జంతువని భావము మాత్రమే కాని తప్పదే

కామిత సంతతిచ్చరయగా అవిదేముడే ! కొల్వుడీప్రజల్‌.

దీపావళి అమావాస్య తరువాత వచ్చే కార్తీక శుద్ధ చవితిని "నాగులచవితి " పండుగ అంటారు. ఇంతకీ, ఈ విషనాగులను మనం పూజించటమేమిటి ? అన్నప్రశ్న వెంటనే తలెత్తుతుంది చాలామందిలో. ఈ పండుగలోని ఆంతర్యమేమిటో ఒక్కసారి పరిశీలిద్దాము.

ప్రకృతికి-జీవికి మధ్య మనకు ఎంతో అవినావ భావ సంబంధము కనిపిస్తూ ఉంటుంది. మనం నిశితంగా పరిశీలించ గలిగితే ప్రకృతినుండి మానవుడు తనకు కావలసింది పొందుతూ తిరిగి ఆ ప్రకృతిని సంరక్షించుకునే బాధ్యతను కూడా నాటి ఆటవిక స్ధాయినుండి, నేటి నాగరిక సమాజం వరకూ ఆ ప్రకృతిని దైవ స్వరూపంగా మానవులు భావించి సంరక్షించుకుంటూ ఉన్నంతకాలం సమస్త మానవకోటికి మరియు జీవకోటి మనుగడకు ముప్పుమాత్రం వాటిల్లదు. ఆ ప్రకృతిని మానవుడు చేజేతులారా కనుక నాశనం చేసుకుంటే ఇటు మానవకోటికి అటు జీవకోటికి తప్పక వినాశానికి దారితీస్తుందను భావముతో నేడు "ప్రకృతి పర్యావరణ రక్షణ" అంటూ పలుకార్యక్రమాలు చేబడుతోంది నేటి సమాజం.

అలా 'ప్రకృతి' మానవ మనుగడకు జీవనాధారమైనది కనుక దానిని దైవస్వరూపంగా భావించి ఆనాటి నుండి నేటివరకూ చెట్టును, పుట్టను, రాయిని, రప్పను, కొండను, కోనను, నదిని, పర్వతాన్ని - ఇలా సమస్త ప్రాణికోటిని దైవస్వరూపంగా చూసుకుంటూ! పూజిస్తూ వస్తున్నారు. అదే మనభారతీయ సంస్కృతిలోని విశిష్టత. నిశితంగా మనం పరిశీలిస్తే... అందులో భాగంగానే 'పాము'ను కూడా నాగరాజుగా, నాగదేవతగా, పూజిస్తూ వస్తున్నారు.

ఈ పాములు భూమి అంతర్భాభాగమందు నివసిస్తూ భూసారాన్ని కాపాడే ప్రాణులుగా, సమస్త జీవకోటికి "నీటిని" ప్రసాదించే దేవతలుగా తలచేవారు. ఇవి పంటలను నాశనంచేసే క్రిమికీటకాదులను తింటూ, పరోక్షంగా 'రైతులకు' పంటనష్టం కలుగకుండా చేస్తాయిట! అలా ప్రకృతి పరంగా అవి మనకు ఎంతో సహాయపడుతూ ఉంటాయి.

పైన చెప్పిన విధంగా సర్పం పేరు చెపితేనే బెదిరిపోతూ ఉంటాము. కాని అంతకంటే భయంకరమైన మానవులు మనలోనే ఉన్నారు.

తలనుండు విషము ఫణికిని, వెలయంగా తోకనుండు వృశ్చికమునకున్‌

తలతోకయనక యుండు ఖలునకు నిలువెల్ల విషము గదరాసుమతీ! అని చెప్పినట్లు...!

అలా! మనచుట్టూ మానవరూపంలో ఉండే మానవులు; సర్పజాతి మనసుకంటే; నికృష్టమైన (అంటే! అవి మనంవాటి జోలికి వెళితేనే ప్రమాదకరమవుతాయి.), వాటికంటే భయంకరమైన మానవ సర్పాలు మనచుట్టూ తిరుగుతున్నా గమనించలేక పోతున్నాం! అని గ్రహించుకోవలసి ఉంది.

అలా మనకంటికి కనబడే విషనాగుపాముకంటే మానవ శరీరమనేపుట్టలో నిదురిస్తున్న నాగుపాము మరింత ప్రమాదకరమని చెప్తారు. ఈ మానవ శరీరమనే పుట్టకు తొమ్మిది రంధ్రాలు ఉంటాయి. వాటినే (నవరంధ్రాలు) అంటూ ఉంటారు. మానవశరీరంలో నాడులతో నిండివున్న "వెన్నుబాము" అంటారు. అందు కుండలినీశక్తి మూలాధారచక్రంలో 'పాము' ఆకారమువలెనే వుంటుందని 'యోగశాస్త్రం' చెబుతోంది. ఇది మానవ శరీరంలో నిదురిస్తున్నట్లు నటిస్తూ! కామ, క్రోధ, లోభ, మోహ, మధ, మాత్సర్యాలనే విషాల్ని గ్రక్కుతూ, మానవునిలో 'సత్వగుణ' సంపత్తిని హరించి వేస్తూ ఉంటుంది. అలా 'నాగులచవితి రోజున ప్రత్యక్షంగా విషసర్పపుట్టను ఆరాధించి పుట్టలో పాలు పోస్తే, మానవునిలో ఉన్న "విషసర్పం" కూడా శ్వేతత్వం పొంది, మన అందరి హృదయాలలో నివశించే "శ్రీమహావిష్ణువు"నకు తెల్లని ఆదిశేషువుగా మారి "శేషపాన్పుగా" మారాలనే కోరిక తో చేసేదే ! ఈ నాగుపాముపుట్టలో పాలుపోయుటలోగల ఆంతర్యమని చెప్తారు.

దీనినే జ్యోతిష్య పరంగా చూస్తే! కుజ, రాహు దోషాలున్నవారు, సాంసారిక బాధలున్నవారు, ఈ కార్తీకమాసంలో వచ్చే షష్టీ, చతుర్దశిలలో మంగళవారము నాడుగాని, చతుర్దశి బుధవారం కలసివచ్చే రోజుకాని దినమంతా ఉపవాసము ఉండి ఈ దిగువ మంత్రాన్ని స్మరిస్తూ!

పాహి పాహి సర్పరూప నాగదేవ దయామయ

సత్సంతాన సంపత్తిం దేహిమే శంకర ప్రియ!

అనంతాది మహానాగ రూపాయ వరదాయచ

తుభ్యం నమామి భుజగేంద్ర సౌభాగ్యం దేహిమే సదా !

అలా! ఆవు పాలు పుట్టలో పోసి నాగపూజచేసి చలిమిడి, చిమ్మిలి, అరటిపళ్ళు మున్నగునవి నివేదన చేస్తారు. ఆ సందర్భంగా పుట్టవద్ద 'దీపావళి నాటి మిగిలిన మతాబులు, కాకరపువ్వొత్తులు టపాసులు చిన్నారులు ఎంతో సంతోషంగా కూడా కాలుస్తారు. ఇలా స్త్రీలు ఆరాధిస్తే శుభప్రదమైన సుఖసంతానము; అదే కన్నె పిల్లలు ఆరాధిస్తే! మంచి భర్త లభించునని పలువురి విశ్వాసము.

ఈ విధమైన నాగుల ఆరాధన ఈనాటిదికాదు. యుగాలనాటిది. సౌభాగ్యానికి, సంతానప్రాప్తికి సర్పపూజ చేయుట అనేది లక్షల శరత్తులనాడే ఉన్నట్లు మన పురాణాలలో ఎన్నో గాధలు కానవస్తున్నాయి. దేశమంతట పలు దేవాలయాల్లో మెలికలతో ఉన్న నాగేంద్రుని విగ్రహాలు కనిపిస్తూ ఉంటాయి. ఈ "నాగులచవితి" నాడు నాగేంద్రుని శివభావముతో అర్చిస్తే సర్వరోగాలు పటాపంచలై సౌభాగ్యవంతులవుతారని ఋషివచనం.

నాగేంద్రా! మేము మా వంశములోవారము నిన్ను ఆరాధిస్తున్నాము. పొరపాటున"తోకతొక్కితే తొలగిపో. నడుంతొక్కితే నా వాడనుకో! పడగ త్రొక్కితే కస్సుబుస్సుమని మమ్ములను భయపెట్టకు తండ్రీ! అంటూ పుట్టకు ప్రదక్షిణ నమస్కరాలు చేయాలని పెద్దలు చెప్తూ ఉంటారు.

ఈ నాగులచవితిరోజున ఈ క్రింది శ్లోకాన్ని పఠిస్తే కలిదోష నివారణ అవుతుందని శాస్త్రాలు పేర్కొంటున్నాయి.

"కర్కోటకస్య నాగస్య దయయంత్యా నలస్య చ |

ఋతుపర్ణస్య రాజర్షే : కీర్తనం కలినాశనమ్‌ ||

ఈ సర్పారాధనకు తామరపూలు, కర్పూరంపూలు, లడ్డు మున్నగునవి ప్రీతికరమని చెప్తారు. సర్పారాధనచేసే వారి వంశం 'తామరతంపరంగా' వర్ధిల్లు తుందని భవిష్య పురాణం చెప్తోంది. మన భారతీయుల ఇళ్లల్లో ఇలవేల్పు సుబ్రహ్మణేశ్వరుడే! ఆయన అందరికీ ఆరాధ్య దైవంకాబట్టి వారి పేరును చాలామంది నాగరాజు, ఫణి, సుబ్బారావు వగైరా పేర్లు పెట్టుకుంటూ ఉంటారు.

నాగర్కోయిల అనే ఊరిలో నాగుపాము విగ్రహం ఉందిట! దాని సమీపంలో 6నెలలు తెల్లని ఇసుక, 6నెలలు నల్లని ఇసుక భూమిలో నుండి ఉబికి ప్తెకివస్తుందని భక్తులు చెప్తూ ఉంటారు. నాగుపాము కుబుసానికి కూడా మంచి ఆయుర్వేద గుణాలు ఉన్నాయని, గరళాన్ని ఆయుర్వేద మందులలో తగుమోతాదులలో ఉపయోగిస్తారని ఆయుర్వేదశాస్త్రం చెబుతుంది. ఇలా ప్రకృతిలో "నాగు పాములకు, మానవ మనుగడలకు అవినాభావ సంబంధం కలదని విదితమవుతుంది.

ఇట్టి ఈ "నాగులచవితి" పండుగను విశేషంగా జరుపుకుని పునీతులమవుదాము.

ఋషి పంచమి

భాద్రపద శుద్ధ పంచమిని రుషి పంచమిగా వ్యవహరిస్తారు. ఆరోజున అత్రి, కశ్యప, భరద్వాజ, గౌతమ, వశిష్ట, విశ్వామిత్ర మహర్షుల గురించి ఒక్కసారైనా తలచుకోవాలని చెబుతారు పెద్దలు. అరణ్యవాసంలో సీతారాములకు అభయమిచ్చినవాడు అత్రి మహర్షి. సాక్షాత్తూ శ్రీహరినే పుత్రునిగా పొందిన మహానుభావుడు. సీతారాములకు చిత్రకూటానికి దారి చూపినవాడు భరద్వాజ మహర్షి. తన భార్య అహల్య ద్వారా రామునికి తన తప:ఫలాన్ని అందింపజేసిన మహారుషి గౌతముడు. రాముని గురువు విశ్వామిత్రుడు. కులగురువు వశిష్టుడు. విష్ణువు అంశావతారమైన పరశురాముని కన్న తండ్రి జమదగ్ని మహర్షి. దశావతారాల్లో ఒకటైన వామనుడి జనకుడు కశ్యపమహర్షి. రుషిపంచమినాడు రామాయణం చదివితే ఈ మహర్షులందరినీ తలుచుకున్నట్టే. 

ఆ మర్నాటి షష్ఠిని సూర్యషష్ఠిగా వ్యవహరిస్తారు. ఆరోజున సూర్యుని ఆరాధిస్తే మంచిదని నమ్మిక. అష్టమినాడు కొన్ని ప్రాంతాల స్త్రీలు కేదారవ్రతం చేస్తారు. ఇక దశమినాడు విష్ణుభక్తులు దశావతార వ్రతం ఆచరిస్తారు. నారాయణుడు వామనుడిగా అవతరించిన దినం భాద్రపద శుద్ధ ద్వాదశి. ఆరోజున శ్రవణా నక్షత్రం కూడా వస్తే మరింత ప్రశస్తం అని ధర్మశాస్త్రాలు చెబుతున్నాయి. 

ఈ మాసంలో శుద్ధ చతుర్దశిని అనంత పద్మనాభ చతుర్దశి అంటారు. ఈరోజున పాలకడలిపై మహాలక్ష్మీసమేతుడై శేష తల్పశాయిగా కొలువైన శ్రీమహావిష్ణువును పూజించడం ఆచారం. తిరువనంతపురం లోని అనంతపద్మనాభస్వామి వ్రతం ఆచరించడం వల్ల దారిద్ర్యం తొలిగి ఐశ్వర్యం లభిస్తుందని భక్తుల ప్రగాఢ విశ్వాసం.

గురు పౌర్ణమి


గురుర్ర్బహ్మ గురుర్విష్ణర్ గురుర్దేవో మహేశ్వరః

గురుస్సాక్షాత్పరబ్రహ్మ తస్మై శ్రీ గురువే నమః

అనాది కాలంనించీ "ఆషాడ శుద్ధపౌర్ణమిని" "గురుపౌర్ణమి" అంటారు. మరియు దీనినే "వ్యాసపౌర్ణమి" గా పరిగణలోనికి తీసుకొని ఆ రోజు దేశం నలుమూలలా గురుపూజా మహాత్సవాలు నిర్వహిస్తూ ఉంటరు. ఆ రోజు ముని శ్రేష్ఠుడైన వ్యాసమహాముని జన్మతిధి కావున ఆ భగవానుని యొక్క జన్మదినం మానవ చరిత్రలొనే అది ఒక అపూర్వమైన ఆధ్యత్మికమైన మహాపర్వదినంగా విరాజిల్లుతుంది. అసలు ఈ ఆసాఢ శుద్ధపౌర్ణమి యొక్క విశిష్ఠత ఏమిటో ...? ముందు తెలుసుకుందాం. దీనికి ఒక చక్కని ప్రాచీన గాధకలదు. పూర్వం "వారణాశి" లో కదుపేద బ్రాహ్మణ దంపతులు ఉండేవారట! ఆత్రేయసగోత్రము గల ఆ బ్రహ్మణుని యొక్క పేరు 'వేదనిధీ. వాని యొక్క భార్య వేదవతీ. ఇరు ఇరువురు ఎల్లప్పుడు చక్కని ఆధ్యాత్మిక చింతనతో భక్తి జ్ఞానము కలిగి జీవించుచుండేవారు. వారు సంతానము భాగ్యము కరకై ఎన్ని నోములు నోచినా, ఎన్ని వ్రతాలు చేసినా; వారికి మాత్రం సంతానము కలుగలేదు. ఇలా ఉండగా; ఒకనాదు 'వేదనిధికీ ప్రతిరోజు మధ్యాహ్న సమయమందు వ్యాసభగవానులు రహస్యంగా గంగానదికి స్నానానికై వస్తూ ఉంటారని వార్త తెలుసుకుంటాడు. ఎలా అయినాసరే! వ్యాసమహర్షి దర్శనం పొందాలని ప్రతిరోజూ వేయికళ్ళతో వెతక నారంభిస్తాదు, ఒకరోజునదీతీరాన ఒక భిక్షువు రూపం ధరించి దండధరుడైన వ్యక్తిని దర్సిస్తాడు. వెనువెంటనే "వేదనిధి" వాని పాదాలను ఆశ్రయిస్తాడు.దానికి ఆ భిక్షువు చీదరించుకుని కసరికొడతాడు. అయినా సరే! పట్టిన పాదాలను మాత్రము విడువకుండా "మహానుభావా! తమరు సాక్షాత్తు వ్యాసభగవానులని" నేను గ్రహించాను. అందుచేతనే, మిమ్మల్ని శరణు పొందగోరుచున్నాను అంటాదు. ఆ మాటలు విన్న ఆ అజ్ఞాత భిక్షువు గంగానది ఒడ్డువైపునకు నలుదిశలా బిత్తరి చూపులు చూస్తూ, ఇంకాతనను ఎవరైనా చూత్తున్నారేమోనని తలచి వెంటనే వేదనిధిని ఆప్యాంగా చేరదీసీ, నాయొక్క రహస్యం మాత్రము ఎవరికి తెలియకూడదు. ఇంతకీ నీకు ఏమికావాలొ కోరుకో అంటాడు. మహానుభావా! రేపు నా తండ్రిగారి పితృకార్యము. దానికి తమరు బ్రహ్మణార్థమై భోజనానికి మా ఇంటికి తప్పక దయచేయవలసిందిగా నా కోరిక! అనిబదులు చేప్తాడు. అందులకు ఆ మహర్షి అతని ఆహ్వానాన్ని అంగీకరిస్తాడు.

అనంతరం ఎంతోసంతోషంగా ఇంటికి చేరుకున్న 'వేదనిధి' తన భార్యామణికి గంగానదీతీరాన జరిగిన వృత్తాంతమంతా వివరిస్తాడు. మరసటిరోజు ఉదయమే ఇచ్చిన మాటప్రకారం వారి గృహానికి విచ్చేసిన ఆ వ్యాస భగవానుని! ఆ దంపతులులతో వారిని పూజిస్తారు. అనంతరం వారి దేవతార్చనకు 'సాలగ్రామమూ, 'తులసీ దళాలు, పూలు మున్నగు పూజాద్రవ్యాలు సిద్ధం చేస్తారు. వారి పూజా అనంతరం ఎంతో శుచిగా మడిగా సర్వవంటకాలను సిద్ధపరచి శ్రద్ధవిధులను విధి విధానంగా నిర్వహిస్తారు. అనంతరం ఆ దంపతులు ఆ వ్యాస భగవానునికి సాష్టాంగ దండ ప్రణామం చేస్తారు. వారి అతిథ్యాని ఎంటో సంతుష్టులైన ఆ ముని శ్రేష్ఠుడు. ఓ పుణ్య దంపతులారా1 మీకు ఎమి వరకావాలో కోరుకోండి. నోమూలూ లేవు. చేయని వ్రతాలు లేవు అయినా! సంతానభాగ్యము మాత్రము మాకు కలుగలేదు! అని బదులు పలుకుతారు. ఓ అదర్శ దంపతులారా! అందులకు మీరు చింతించవలసిన పనిలేదు. త్వరలోమే మీకు తేజోవంతులు, ఐశ్వర్యవంతులు అయిన పదిమంది పుత్రసంతతికలిగి, మీరు చక్కని సుఖజీవనముతో జీవితంలో ఎన్నో సుఖభోగాలాను అనుభవిస్తూ; అంత్యమున విష్ణుసాయుజ్యాన్ని పొందగలరు, అని అశీర్వదించి తిరుగు ప్రయాణమవుతున్న వ్యాసభగవానునితో ప్రభూ! తిరిగి తమదర్శన భాగ్యము మాకు ఎలా కలుగుతుంది? అని 'వేదనిధీ ప్రశ్నిస్తాడు. అందులకు వ్యాస మహర్షి అంటారు.....!....!....!

"శృణు విప్రతవేచ్చా చేత్ దర్శనార్థం తదాత్వయా

పూఅజనీయో విశేషేణ, కథావాచయితా స్వయం"

అని అంటే, ఓ భూసురోత్తమా! నన్ను మరల మరల దర్శించుచు ఉండాలని మీరు ఎంతో కోరికతో ఉన్నారని నేను గ్రహించుచున్నాను. అందువలకు నన్ను మీరు ఎలాదర్శించగలరో చేప్తాను, వినండి. ఎవరైనా ఎప్పుడైనా, ఎక్కడైనా సరే! మన వేద వేదాంగముల యొక్క రహస్యాలను, ఇతిహాసములయొక్క గూడార్థాలు ఉపదేశిస్తూ ఎవరైతే ఉంటారో! అతడే నా యొక్క నిజస్వరూపంగా తెలుసుకుని అట్టి పురాణ కథకుడైనా ఆతన్ని సాక్షాత్తు వ్యాసమూర్తిగా భావించి పూజింపవలెను. అట్టి పౌరాణికులందరిలోను నేను ఎల్లప్పుడూ ఉంటాను. అని! ఆ శ్లోకభావము.

అంతియేకాదు ఎవరైనాసరే! గతకల్పాలలో జరిగిన చరిత్ర; విస్వం యొక్క పూర్వవృత్తాంతం; పూరాణగాథలు మున్నగునవి విప్పి చెప్పాలంటే! వార్మి వ్యాస భగవానుని అనుగ్రహము లేనిదే చేప్పలేరు. కావున అట్టి పౌరాణికుణ్ణి ఎంచి ఆషాఢ శుద్దపాద్యమి"నాడు వార్కి "గురుపూజ" చేసి పూజించవలెనని చెప్పారు. నాటినుండి నేటివరకు ఆచారము కొనసాగుచునే ఉన్నద అని మనము గమనిస్తున్నాము గదా!'-మరి. అది విన్న 'వేదనిధీ మరోమారు వ్యాసభవానుని ప్రశిస్తాడు. మహాత్మాతమను ఏయే రోజుల్లో ఎవిధంగా పూజించాలి? సవిస్తరంగా చెప్పవలసింది అంటాడు.

"మమ జన్మదినే సమ్యక్ పూజనీయః ప్రయత్నతః

ఆషాధ శుక్ల పక్సేతు పూర్ణిమాయాం గురౌతథా

పూజనీయే విశేషణ వస్త్రాభరణ ధేనుభిః

దక్షిణాభిః మత్స్యరూప ప్రపూజయేత్

ఏపం కృతే త్వయా విప్రః మత్స్య రూపస్య దర్శనం

భవిష్యతి నసందేహొమ యైవోక్తం ద్విజోత్తమ."

ఓ బ్రహ్మణోత్తమా! నేను జన్మించిన ఆషాధశుద్ధ పౌర్ణమినాడు ఈ గురుపూజను ఆరోజు శ్రద్ధాభక్తులతో చేయాలి. ఆ రోజు కనుకాగురువారమూ అయిన ఎడలాది మరింతగా స్రేష్ఠమైనది. వస్త్ర, అభరణ గోదానములతో అర్ఘ్య పాదాలతోటి నా రూపాన్ని పూజించువార్కినా స్వరూప సాక్షాత్కారం వార్కి లభిస్తుంది; అని సాక్షాత్తు వ్యాస పౌర్ణమి, నేటికినీ, సర్వులకు అత్యంత పుణ్య ప్రదముగా చెప్పబడుచున్నది. ఈ గాథ పూర్వము నారదుడు వైశంపాయనుడికి "ఈ గురు పౌర్నమి యొక్క విశిష్టత వివరించినట్లుగా బ్రహ్మండ పురాణంలోనూ "స్వధర్మసింధూ" అనే గ్రంధములోను వివంగా చెప్పబడి యున్నది. దీనిని బట్టి వ్యాసులవారి యొక్క జన్మ ఆషాఢ శుద్ధపాడ్యమి అని విదితమవుచున్నది.

వ్యాసం వశిష్ఠ నప్తారం శక్తేః పౌత్ర మకల్మషం

పరాశరాత్మజం వందే శుకతాతం తపోనిధం

వ్యాసాయ విష్ణురూపాయ వ్యాస రూపాయ విష్ణవే

నమోవై బ్రహ్మనిధయే వాసిష్టాయ నమోనమః

అట్టి పరమ పవిత్రమైన "గురుపౌర్ణమి" పుణ్యదినం మనంతా విశేషంగా జరుపుకుని ముందు తరాలవార్కి మార్గదర్శకుల మౌతూ, పునీతులౌదాము.

రాఖీ పండుగ

ప్రతీ సంవత్సరం శ్రావణమాసంలో వచ్చే పూర్ణిమను "శ్రావణపూర్ణిమ లేక జంధ్యాల పూర్ణిమ" మరియు రాఖీ లేక రక్షాబంధన్ పండుగ అని పిలుస్తూ ఉంటారు. జంధ్యాలు ధరించే వారందరూ ఈరోజున నూతన జంధ్యాలు ధరిస్తారు. 

ఈ రోజు బ్రాహ్మణులు నూతన యజ్ఞోపవీతధారణలు చేసి విద్యార్ధులకు వేదపఠనం ప్రారంభిస్తారు. వేదపండితులు వేదాలను వల్లెవేయడం అంటే; ఆ వృత్తి చెయ్యడం ఈ రోజునుండే ప్రారంభిస్తారు. ఆ విధంగా వీరు ఈరోజు వేదాలన్నింటిని ప్రారంభ ఋక్కును, చివరి ఋక్కును పఠిస్తారు. కాలక్రమంలో ఈ రోజు "రక్షాబంధన్ లేక రాఖీ" పండుగగా ప్రాచుర్యం పొందసాగింది. ఈ రక్షాబంధనము ఈ దిగువ మంత్రాన్ని పఠిస్తూ భార్య - భర్తకు, సోదరి - సోదరునకు యుద్ధానికి వెళ్ళే వీరునకు విజయప్రాప్తి కోసం ఈ రక్షాబంధనన కడుతూఉంటారు. 

యేన బద్ధో బలీరాజా దానవేంద్రో మహాబలః|

తేన త్వామభి బధ్నామి రక్షమాచల మాచల||
 

శ్రీ మహావిష్ణువు శక్తిచే మహాబలుడు అయిన బలిచక్రవర్తిని బంధించినట్లుగా ఓ రక్షాబంధనమా! నీవు చలించక వీనికి రక్షణ కల్పించుము అని మంత్రార్థం. ఈ - రక్షాబంధన్ ఎలా ప్రారంభమైనది అంటే! ఈ గాథ మనకు మంచి ప్రామాణిక మవుతుంది. 

పూర్వం దేవతలకు - రాక్షసులకు మధ్య పుష్కరకాలం యుద్ధము సాగింది. ఆ యుద్ధములో ఓడిపోయిన దేవతల రాజు దేవేంద్రుడు నిర్వీర్యుడై తన పరివారమంతటిని కూడగట్టుకుని 'అమరావతి' లో తలదాచుకుంటాడు. అట్టి భర్తనిస్సహాయతను గమనించిన ఇంద్రాణి 'శచీదేవి' తగు తరుణోపాయమునకై ఆలోచిస్తూ ఉన్న సమయాన ఆ రాక్షసరాజు చివరకు 'అమరావతి'ని కూడా దిగ్భంధన చేయబోతున్నాడు అని గ్రహించి, భర్త దేవేంద్రునకు 'సమరోత్సాహము' పురికొలిపినది. సరిగా ఆరోజు "శ్రావణ పూర్ణిమ" అగుటచేత 'పార్వతీ పరమేశ్వరులను', లక్ష్మీ నారాయణులను పూజించి ఆ పూజించబడిన "రక్షా" దేవేంద్రుని చేతికి కడుతుంది. అది గమనించిన దేవతలందరు వారు పూజించిన రక్షలు తెచ్చి ఇంద్రునకు కట్టి ఇంద్రుని విజయాత్రకు అండగా నిలచి, తిరిగి 'త్రిలోకాధిపత్యాన్ని' పొందారు. ఆనాడు శచీదేవి ప్రారంభించిన 'ఆ రక్షాబంధనోత్సవం' నేడు అది 'రాఖీ' పండుగ ఆచారమైనది. 

ఈ రాఖీకి ఉన్న పవిత్రత ఏమిటంటే భార్య - భర్తకు, సోదరి - సోదరులకు కట్టే రఖీద్వారా వారి వారు తలపెట్టే కార్యములు విజయవంతమై సుఖసంపదలు కలగాలని, వారి మాన మర్యాదలకు వారు బాసటగా ఉండాలని ఆకాంక్షించే సత్ సంప్రదాయమే ఈ 'రాఖీ' విశిష్టత. అలా రాఖీలు కట్టించుకున్న భర్తలు, సోదరులు వార్కి నూతన వస్త్రాలు చిరుకానుకలు సమర్పించి, అందరు కలసి చక్కని విందు సేవిస్తారు. 

విదేశీయులు మనదేశాన్ని పాలిస్తున్న రోజులలో మొగాలాయీల దుర్నీతికి దురంతాలకు ఏమాత్రం అడ్డూ అపూ అనేది లేకుండా పోయేది. హిందూ జాతి వారి కబంధహస్తాలలో నలిగిపోయేది. స్త్రీలు వారి మాన ప్రాణరక్షణకై వీరులైన యోధులను గుర్తించి వార్కి 'రక్షాబంధనం' కట్టి వారు చూసే సోదర భావముతో, రక్షణ పొందేవారు. ఒకసారి 'రాణి కర్ణావతి' శత్రువులు తన దుర్గాన్ని ముట్టడించినప్పుడు 'ఢిల్లీపాదుషాకు' రాఖీ పంపగా ఆమెను సోదరిగా భావించి శత్రువులను తరిమికొట్టి ఆ సోదరి ఇంట భగినీ హస్తభోజనంచేసి, కానుకలు సమర్పించినట్లు గాధలు ఉన్నాయి. 

అట్టి శ్రావణ పూర్ణిమ లేక జంధ్యాల పూర్ణిమ, మరియు రాఖీ లేక రక్షాబంధన్ పండుగ అమితానందంతో జరుపుకుని మన చక్కని భారతీయ సంప్రదాయ విలువలను కాపాడుదాం!

తొలిఏకాదశి

శాంతాకారం భుజగశయనం, పద్మనాభం, సురేశం

విశ్వాకారం, గగన సదృశం మేఘవర్ణం శుభాంగం

లక్ష్మీకాంతం, కమలనయనం యోగి హృద్ధ్యానగమ్యం

వందే విష్ణుం, భవభయహరం సర్వలోకైక నాధం.
 

అని విష్ణుస్తోత్రం గావించుకుని 'తొలిఏకాదశి' ని గూర్చి సమీక్షగా తెలుసుకుందాం! ప్రతీసంవత్సరం ఆషాడ శుద్ధ ఏకాదశిని 'తొలిఏకాదశి' గా అంటారు. ఎందుచేతనంటే! పూర్వకాలమందు ఈ తోలిఏకాదశితోనే, సంవత్సర ప్రారంభంగా కూడ చూచేవారట! ఈ రోజును 'శయన ఏకాదశి' అనికూడా పిలుస్తారు ఎందువల్లననగా; శ్రీమహావిష్ణువు ఆరోజునుండి కార్తీకశుద్ధ ఏకాదశి వరకు యోగనిద్రలో ఉంటాడని, నాటినుండి శ్రీహరిభక్తులు కామక్రోధాధులు వర్జించి ప్రయాణాలు చేయకుండా ఒకేచోట ఉండి శ్రీహరిని అర్చిస్తూ తిరిగి కార్తీకశుద్ధ ఏకాదశి 'ఉత్థాన ఏకాదశి' వరకు ఆనాలుగు మాసములు చాతుర్మాస్య వ్రతం చేయుట కూడా మన భారతీయ సంప్రదాయములలో ఒకటి. ఆరోజు 'శ్రీహరి' శేషతల్పం పైనుండి మేల్కొంటాడు. ఈ చాతుర్మాస్య దీక్షను సన్యాసులు మాత్రమేకాదు. సంసారులు, వయో, లింగబేధము లేకుండా భక్తులందరూ దీనిని ఆచరిస్తూ ఉంటారు. 

ఈ 'తొలి ఏకాదశి' నాడు "గోపద్మ వ్రతం" చేయుట ఎంతో విశిష్టమైనదిగా చెప్తారు. ఇంతకీ గోవును పూజించుటలో గల ఆంతర్యమేమిటో కూడా ఈ సందర్భంగా కొద్దిగా తెలుసుకుందాం! 

ఈ గోమాత పూర్తిగా విరాట్ పురుషుని రూపంతో పోల్చబడింది. గోవునకు ముఖమునందు వేదాలు, కొమ్మలయందు హరిహరులు, కొమ్ముల చివర ఇంద్రుడు, లలాటమున ఈశ్వరుడు, కర్ణములందు అశ్వనీదేవతలు నేత్రములందు సూర్యచంద్రులు, దంతములయందు గరుడుడు, జిహ్వయందు సరస్వతి, ఉదరమునందు స్కందుడు, రోమకూపములందు ఋషులు, పూర్వభాగమునందు యముడు, పశ్చిమ భాగమునందు అగ్ని, దక్షిణభాగమున వరుణ కుబేరులు, వామభాగము నందు యక్షులు, ముఖమునందు గంధర్వులు, నాసాగ్రమందు పన్నగలు, అపానంబున సరస్వతి, గంగాతీర్థంబులు, గోమయంబున లక్ష్మీ, పాదాగ్రంబున ఖేచరులును, అంబా అంటూ అరచే అరుపులో ప్రజాపతి, స్థనములందు చతుస్సాగరములు ఉన్నట్లుగా వర్ణింపబడెను. కావున గోవును పూజిస్తే! సమస్త దేవతలను పూజించి నట్లేనని, సమస్త తీర్థములలో పుణ్యస్నానంచేసిన పుణ్యఫలం లభిస్తుందని 'గోమాతకు' ఇంత పూజ్యస్తానమిస్తూ, అధర్వణ వేదంలో బ్రహ్మాండపురాణంలో, మాహాభారతంలో, పద్మపురాణంలో ఇలా ఎన్నో గాధలు ఉన్నాయి. 

అట్టి గోమాత నివశించే గోశాలను ఈ 'తొలిఏకాదశి' దినమందు మరింతగా శుభ్రముచేసి అలికి ముత్యాల ముగ్గులతో రంగవల్లికలను తీర్చిదిద్ది గోశాల మధ్యభాగమందు బియ్యపు పిండితో ముప్పైమూడు పద్మాల ముగ్గులు పెట్టి, శ్రీమహాలక్ష్మీ సమేత శ్రీమహావిష్ణువు ప్రతిమను ఆపద్మములపైనుంచి, వారిని విధివిధానంగా పూజించి, పద్మానికి ఒక్కొక్క "అప్పడాన్ని" వాటిపై ఉంచి ఆ అప్పడాలను వాయనాలను, దక్షిణ తాంబూలాదులలో బ్రాహ్మణుని సంతుష్టుని గావించి, గోమాతను పూజించువార్కి సకలలాభీష్టములు తప్పక నెరవేరుతాయని చెప్పబడినది. అలా, గోపద్మవ్రతం చెయ్యాలి. 

ఇంత పుణ్యప్రదమైన తొలిఏకాదశి పర్వదినం శుభప్రదముగా జరుపుకుని పునీతులౌదాము.