ఆశ్వయుజ మాసము లేబుల్‌తో ఉన్న పోస్ట్‌లను చూపుతోంది. అన్ని పోస్ట్‌లు చూపించు
ఆశ్వయుజ మాసము లేబుల్‌తో ఉన్న పోస్ట్‌లను చూపుతోంది. అన్ని పోస్ట్‌లు చూపించు

దీపావళి

దీపావళిభారతీయ ఆధ్యాత్మికాచారాలలో పండుగలకున్న ప్రాధాన్యత ప్రత్యేకమైనది. పండుగను అభిమానించని భారతీయుడు ఉండడు. ప్రత్యేకంగా పండుగను చేసుకోని నాస్తికులు సైతం పండుగ దినాలను మాత్రం ఖచ్చితంగా సంతోషంగా అనుభవించే తీరతారు. అది పూజతో నిమిత్తం లేనిది. సంతోష ఉత్సాహాలకు నిలయమైనది. కాబట్టే పండుగ అనే భావన ఎటువంటివారిలోనైనా అలౌకికానందాన్ని పంచుతుంది. ఒక్కో పండుగ ఒక్కో ప్రత్యేకమైన శోభను చేకూరుస్తూ మానసికోల్లసాన్నిస్తూ గృహాలకు కొత్త అందాలను ఇస్తుంది. అందుకే చిన్నా, పెద్దా అందరూ వీటికోసం ఎంతో ఆర్తిగా ఎదురుచూస్తుంటారు. పండుగల సంబరాలు చిన్న పిల్లలవే అయినప్పటికీ ఆ ముచ్చట్లను పెద్ద్లలు కూడా ఎంతో సంతోషంగా అనుభవిస్తారు. వరలక్ష్మీ వ్రతం, అట్లతద్ది, నాగుల చవితి వంటి పండుగలను స్త్రీలు ఇష్టపడితే, ఉగాది, వినాయక చవితి వంటివి ఎక్కువ శాతం పురుషులు ఇష్టపడడం సహజంగా జరుగుతూ ఉంటుంది. ఐతే వయసుతో నిమిత్తం లేకుండా, స్త్రీ, పురుష భేదం లేకుండా అందరూ ఇష్టపడే ఏకైక పండుగ మాత్రం దీపావళి ఒక్కటే. 

దక్షిణ భారతదేశమంతా మూడు రోజులపాటు జరుపుకునే దీపావళి ఎంతో ఉత్తేజకరమైన పండుగ. ఆశ్వయుజ బహుళ చతుర్దశి, అమావాస్య, కార్తీక శుద్ధ పాఢ్యమి మూడు రోజులనూ కలిసి సమగ్రమైన దీపావళి. ఈ మూడు రోజుల్లో మొదటిది నరక చతుర్దశి. రెండవది దీపావళి. మూడవది బలిపాడ్యమి. 

దీపావళిఈ పండుగను ఆచరించే విధానంలో అనేక గాధలున్నాయి. 1. నరకాసుర వధ, 2. బలి చక్రవర్తి రాజ్యదానము, 3. శ్రీరాముడు రావణ సంహారానంతరం అయోధ్యకు తిరిగి వచ్చి భరతునితో సమావేశమగుట (భరత్ మిలాప్), 4. విక్రమార్క చక్రవరి పట్టాభిషేకం. భారత దేశమంతటా ప్రచారమున్న గాధ నరకాసుర వధ. ఆశ్వయుజ కృష్ణ చతుర్దశి నాటి రాత్రి రెండు జాములకు తరువాత శ్రీకృష్ణుడు నరకాసురుని వధించెను. నరకుడి పీడ వదలటంతో ఆనందపరవశులైన ప్రజలు అదే రాత్రి మిగిలిన భాగమును, మరుదినమునను మహోత్సవాలు జరుపుకొన్నారు. ఆనాటి ఉత్సవాలకు చిహ్నంగా ప్రజలు ప్రతి యేటా ఈ రెండు రోజులూ గొప్పగా పండుగలు చేసుకొంటున్నారు. భరత్ మిలాప్ : శ్రీరామచంద్రుడు రావణ వధానంతరం లంక నుండి అయోధ్యా నగరానికి మరల తిరిగిరావడం, పట్టాభిషేకం జరగడం ఈనాడే అంటారు. శ్రీరాముడు భరతునితో మరల కలియుటకు ఉపలక్షణంగా "భరత్ మిలాప్" అను పండుగ ఉత్తర భారతమంతా నేటికీ చేస్తున్నారు. ఈ విశ్వాసం వల్లనే రాజులు విజయదశమి నాడు సీమోల్లంఘన చేసి శత్రువులపై దాడి చేసి, విజయంతో దీపావళి నాడు మరలి వచ్చుట సంప్రదామయ్యింది. ఒక్కో పురాణంలో, ఒక్కో ధర్మ శాస్త్రంలో ఒక్కో గాధ లిఖించబడినప్పటికీ నరకాసుర వధ మాత్రమే దీపావళి పండుగకు అంకురార్పణ అన్న గాధనే అందరూ అనుసరిస్తుండడంతో అదే స్థిరపడిపోయింది. 

దీపావళిఆశ్వయుజ మాస బహుళ చతుర్ధశిని 'నరక చతుర్ధశి' అని, ఆ మరుసటి రోజును 'దీపావళి' అమావాస్య అని అంటారు. ఇది పిన్నలకూ, పెద్దలకూ సరదా పండుగ. తలస్నానం చేసి, కొత్త దుస్తులు ధరించడం, పిండివంటలతో భోజనం చేసి, సాయంత్రం కాగానే దీపాల్ని వరుసగా వెలిగించి, అనంతరం టపాకాయలు కాల్చడం ఈ పండుగకు ఆనవాయితి. నరకాసుర సహారం జరిగినందుకు ఆనంద సూచకంగ జరుపుకొనే ఈపండుగ, మార్వాడీలకు ఇంకో విధంగా కూడా ప్రత్యేకమైనది. వారికిది లక్ష్మీ పూజాదినం. పాత ఖాతాలు మూసేసి, కొత్త పద్దులు ప్రారంభిస్తారు. 

శ్రీకృష్ణుడు సత్యభామ సమేతుడై లోకకంటకుడైన నరకాసురుని వధించినందుకు సంబరంగా జరుపుకొనే ఈ దీపావళి పండుగను దేవదానవులు పాలసముద్రాన్ని మధించినప్పుడు వచ్చిన దివ్యజ్యోతి ఈ జీవకోటికి వెలుగును ప్రసాదించిన విశిష్టమైన రోజుగా మరియు శ్రీరామచంద్రుడు రావణ సంహారం గావించి సీతాదేవితో అయోధ్యకు చేరి పట్టాభిషిక్తుడైన శుభసందర్భంగా కూడా చెప్పుకుంటారు. 

దీపావళికి దేదీప్యమైన దివ్యకాంతుల దీపాలను అలంకరించి, బాణాసంచా కాలుస్తూ, అందరూ వారి వారి ఆనందాలను వ్యక్త పరుస్తూ ఉంటారు. ఇక ప్రకృతి పరంగా ఆలోచిస్తే, ఈ కాలమందు సర్వజీవులను వ్యాధిగ్రస్తులను చేసే కీటకాలు, పంటలను నాశనము చేసే క్రిమికీటకాలు అధికంగా ఉధ్బవిస్తాయి. కనుక ఈ బాణాసంచా కాల్పుల వల్ల కీటకసంహారం కలిగి ప్రజలకు అన్నివిధాల మేలు జరుగుటకే ఈఆచారం పెట్టి ఉంటారని పెద్దలు చెప్తూ ఉంటారు. 

దీపావళిఏ ఇంటి యందు దీపాలు సమృద్ధిగా వెలుగుతాయో, ఆ ఇంట శ్రీమహాలక్ష్మి ప్రవేశిస్తుందని మనకు ఋగ్వేదం చెప్తోంది. అటువంటి పుణ్య దిన సాయం సంధ్యా కాలమందు లక్ష్మీస్వరూపమైన తులసికోట ముందు తొలుత దీపాలు వెలిగించి, శ్రీమహాలక్ష్మి అష్టోత్తరశతనామాలతో క్రింద వర్ణించిన విధంగాపూజ గావించి, ఈ సర్వప్రాణ కోటికి హృదయ తాపాలను పోగొట్టు సర్వ సంపన్న శక్తివంతురాలుగా భావించి, నివేదన చేసి, పూజానంతరం గృహమంతా దీపాలంకృతం చేయుటవల్ల కాలి అందియలు ఘల్లు ఘల్లుమ‌ని అన్నట్లు ఆమహాలక్ష్మి ప్రసన్నమౌతుందట!

అట్లతద్ది


ప్రతీ సంవత్సరం ఆశ్వీయుజ బహుళ తదియనాడు అత్యంత భక్తిశ్రద్ధలతో జరుపుకునే ఈ "చంద్రోదయ ఉమావ్రతం - అట్లతద్ది" స్త్రీలకు చక్కని ఆనందాన్ని జీవితంలో చక్కని విచిత్రానుభూతులను కలిగిస్తూ ఉంటుంది. ఈ పండుగలో ఒక విశేషం ఉన్నది. కొన్ని వ్రతాలైతే వివాహితులైన స్త్రీలు మాత్రమే నిర్వహిస్తారు. కానీ, ఈ పండుగ పిన్నలు, పెద్దలు కూడా కలిసి వయోభేదం లేకుండా ఆచరిస్తారు. పిల్లలతోబాటు తల్లులు కూడా 20 సం|| వెనకకి పోయి బాల్యజీవితంలోకి వెళ్ళి ఆనందం పొందుతారు. ఇక మూడుకాళ్ల ముదుసలి అయిన బామ్మగారు కూడా! వారి ఆటలాడుకుంటున్న వారినందరని తన దగ్గరకు రప్పించుకుని అమ్మాయిలూ... చూచారా... నా చిన్నప్పుడూ! అంటూ, వారి చిన్ననాటి జ్ఞాపకాలు, అనుభవాలు ..చూచారా... నా చిన్నప్పుడూ! అంటూ ఉంటారు. అటువంటి వృద్ధులలో నవయవ్వనం తొణికిసలాడేది ఈ పండుగలోనే. ఇట్టి ఆటపాటలు కనువిందుచెయ్యాలి అంటే పల్లెసీమలే పట్టుకొమ్మలు.

ఈపండుగను పల్లెలలో అయితే ఊయల పండుగ అంటూ, మరికొందరు గోరింటాకు పండుగ అంటూ, ఇలా ఈ "చంద్రోదయ ఉమావ్రతం - అట్లతద్ది" పండుగను వివిధ నామాలతో పిలుచుకుంటూ ఉంటారు. స్త్రీలకు ఇటు చక్కని ఆనందాన్ని అటు సకల సౌభాగ్యాలను ఒసగే ఈ పండూగలోని ఆ "ఉమాదేవిని" ఒక్కసారి ఇలా ప్రార్థించి మరలా ముచ్చటించుకుందాం!

అట్లతద్ది
శ్లో|| ఓం హ్రీం కాలాభ్రాం భాం కటాక్షై రశికుల

భయదాం మౌలిబద్దేందురేఖాం

శంఖచక్రం కృపాణం త్రిశిఖమపి

కర్తైరుద్వహంతీ త్రినేత్రామ్

సింహస్కంధాదిరూఢాం త్రిభువన మఖిలం

తేజసా పూరయంతీం

                                                                                                                   ధ్యాయేత్ దుర్గాం జయాఖ్యాం

                                                        త్రిదశపరివృతాం సేవితాం సిద్ధికామైః ||


ఇక ఈ పండుగ ముందు రోజు భోగి అంటారు. ఈ రోజు స్త్రీలు, పిన్నలు, పెద్దలు చేతులకు పాదాలకు గోరింటాకు పెట్టుకొని, ఎవరిచేయి బాగా పండితే వారు అంత అదృష్టవంతులై వారి అభీష్టాలు అన్ని నెరవేరుతాయని విశ్వసిస్తూ ఉంటారు. తరువాత ఒకరిచేతులు ఒకరికి చూపించుకుంటూ నాచేయి బాగా పండింది అంటే! నా చేయి బాగా పండింది అంటూ సంబరపడిపోతూ ఉంటారు. ఈ పండుగ కోసం ప్రతి ఇంటా వారి పెరిటిలో ఊయల కట్టుకుంటారు. మరుసటి రోజు ఆశ్వీయుజ బహుళ తదియనాడు (అట్లతద్ది) తెల్లవారు ఝామునే నిద్రలేచి కాలకృత్యాలు తీర్చుకుని, "చద్దీన్నం గోంగూరపచ్చడి పెరుగు అన్నం" తో కడుపార భుజించి, ఇరుగు పొగురువారినందరిని లేపుతూ.... అట్లతద్దోయ్ ఆరట్లోయ్ ముద్దపప్పోయ్ మూడట్లోయ్...అంటూ! పాటలు పాడుతూ ఇరుగు పొరుగువారిని లేపి వారికి తోడ్కొనివచ్చి వివిధరీతుల ఆటలు ఆడుతూ, పాటలు పాడుతూ, ఊయల ఊగుటలో ఒకరిపై ఒకరు పోటీపడుచూ పల్లెవాసులందరికీ మరింతగా కనువిందు చేస్తారు.

ఇక ఆరోజు "చంద్రోదయము" అయ్యేవరకు భక్తి శ్రద్ధలతో ఉపవాసముండి, చంద్రోదయముకాగానే స్నానమాచరించి మడిగా అట్లు వేసుకొని నివేదనకు సిద్ధం చేసుకుంటారు. అనంతరం షోడశోపచారములతో 'ఉమాశంకరులను పూజించి అట్లతద్ది వ్రత కథను చెప్పుకుని, ఆ కథాక్షతలను శిరస్సులపై ఉంచుకొని ముత్తైదువులతో కలిసి భుజిస్తారు. ఇలా ఆచరిస్తే, కన్నెపిల్లలకు నవయవ్వనవంతుడైన అందమైన భర్త లభిస్తాడని, వివాహితులకైతే ఆ ఉమాదేవి అనుగ్రహముతో మంచి సౌభాగ్యము కలిగి సర్వసౌఖ్యములను అనుభవిస్తూ పిల్లపాపలతో సుఖమైన ఆనందమైన జీవితం అనుభవిస్తారని ఈ వ్రతాన్ని ఆచరిస్తారు. ఈ వ్రతం పై కూడా, ఒక గాధ ఉన్నది.

పూర్వం ఒక మహారాజుకు రూప లావణ్యవతి అయిన కూతురు ఉండేది ఆమె పేరు "కావేరి". ఆమె తల్లి వలన ఈ వ్రతమహత్మ్యమును తెలుసుకుని తన రాజ్యమందుగల ఆమె స్నేహితురాళ్ళు మంత్రి కూతురు, సేనాపతి కూతురు, పురోహితుని కూతురుతో కలిసి " ఈ చంద్రోదయ ఉమావ్రతాన్ని" అత్యంత భక్తిశ్రద్ధలతో ఆచరించింది. కాని తోటి మంత్రికూతురికి, సేనాపతి కూతురికి, పురోహితుని కూతురుకి వివాహ వయస్సు రాగానే నవయవ్వనవంతులైన అందమైన భర్తలతో వివాహము జరిగింది. అంత మహారాజు! అమ్మాయి స్నేహితురాండ్రకు వివాహములు జరిగిపోవుచున్నవి అని తలచి తన కుమార్తెకు వివాహ ప్రయత్నములు చేయనారంభించగా కురూపులు, వృద్ధులైన పెండ్లికుమారులే తారసపడసాగిరి. మహారాజు ప్రయత్నములన్నీ విఫలములగుట చూచిన రాకుమార్తె చివరకు తన తండ్రి వివాహము చేయునేమో అని భయముచెంది, ఆ రాజ్యమునకు సమీప అరణ్యమునకు పోయి ఘోరమైన తపస్సు చేయసాగింది.

ఒకరోజు పార్వతీ పరమేశ్వరులులోక సంచారముచేస్తూ ఘోరమైన తపమాచరిస్తున్న ఆ ముక్కు పచ్చలారని రాకుమారైపై అనుగ్రహము కలిగి ప్రత్యక్షమై ఓ కన్యాకుమారీ! ఎందులకై ఈ ఘోరమైన తపమాచరించుచున్నావు? నీకు ఏ వరం కావాలో కోరుకోమనగా 'ఓ ఆది దంపతులారా! నేను నా స్నేహితురాండ్రముకలిసి నా తల్లి ద్వారా తెలుసుకున్న "చంద్రోదయ ఉమావ్రతం అట్లతద్ది వ్రతాన్ని భక్తిశ్రద్ధలతో ఆచరించగా వార్కి మంచి భర్తలు లభించుట ఏమిటి? నా తండ్రిగారు చేయు ప్రయత్నములు ఫలించక కురూపులు, వృద్ధులు అయినవారు లభించుట ఏమిటి? ఇందులో నాదోషమేమిటి?' అని దుఃఖించసాగెను.

ఓ సౌభాగ్యవతి! ఇందులో నీ దోషము ఏ మాత్రము లేదు. నీవు ఆ నోము నోచుసమయాన నీవు ఉపవాస దీక్షను తాళలేక సొమ్మసిల్లి పడిపోగా; విషయమంతా నీతల్లి ద్వారా నీ సోదరులు తెలుసుకుని ఒక ఇంద్రజాల విద్యను ప్రదర్శించి అద్దముగుండా నీకు చంద్రుని చూపించినారు. దానితో నీవు ఉపవాస దీక్ష విరమించినావు. ఆ వ్రత భంగమే ఇది. నీ సోదరులకు నీపైగల వాత్సల్యముతో అలా చేసినారు. అయినా! ఇందులో నీవు దుఃఖించవలసిన పనిలేదు, రేపువచ్చే ఆశ్వీయుజ బహుళ తదియనాడు విధివిధానంగా వ్రతమాచరంచు. నీ మనోభీష్టము తప్పక నెరవేరుతుంది అని "కావేరి"ని ఆశీర్వదించి అంతర్థానమైనారు.

అలా ఆ రాకుమారై తిరిగి శ్రద్ధాభక్తులతో వ్రతమాచరించి మంచి అందమైనవాడు, తనమనసెరిగినవాడు, చక్కని శౌర్యపరాక్రమములు కలిగిన నవయవ్వన రాకుమారునితో వివాహమై నిరంతరము ఉమాశంకరులను సేవిస్తూ సమస్త సుఖభోగములను అనుభవించసాగినది. అట్టి పుణ్య ప్రదమైన "ఈ చంద్రోదయ ఉమావ్రతం "అట్లతద్ది" భక్తిశ్రద్దలతో ఈ వ్రతమాచరించి ఉమాశంకరుల అనుగ్రహపాత్రులౌదురుగాక.

విజయ దశమి (దసరా)


దేవదానవులు పాలసముద్రమును మధించినప్పుడు అమృతం జనించిన శుభముహూర్తదినం ఈ విజయదశమి రోజే అని తెలియజేయబడింది. 'శ్రవణా' నక్షత్రంతో కలసిన ఆశ్వీయుజ దశమికి 'విజయా' అనే సంకేతమున్నది. అందుకనే దీనికి 'విజయదశమి' అనుపేరు వచ్చినది. ఏపనైనా తిధి, వారము, తారాబలము, గ్రహబలము, ముహూర్తము మున్నగునవి విచారించకుండా, విజయదశమినాడు చేపట్టినచో ఆ కార్యమున విజయము తధ్యము. 'చతుర్వర్గ చింతామణి' అనే ఉద్గ్రంధము ఆశ్వీయుజ శుక్ల దశమినాటి నక్షత్రోదయ వేళనే 'విజయం' అని తెలిపియున్నది. ఈ పవిత్ర సమయము సకల వాంచితార్ధ సాధకమైనదని గురువాక్యము.

'శమీపూజ' చేసుకునే ఈరోజు మరింత ముఖ్యమైనది. శమీవృక్షమంటే 'జమ్మిచెట్టు'. అజ్ఞాతవాసమందున్న పాండవులు వారివారి ఆయుధములను, వస్త్రములను శమీవృక్షముపై దాచి వుంచారు. అజ్ఞాతవాసము పూర్తి అవగానే ఆ వృక్ష రూపమును పూజించి ప్రార్ధించి, తిరిగి ఆయుధాలను వస్త్రములను పొంది, శమీవృక్ష రుపమున ఉన్న 'అపరాజితా' దేవి ఆశీస్సులు పొంది, కౌరవులపై విజయము సాధించినారు.

శ్రీరాముడు ఈ విజయదశమి రోజున ఈ 'అపరాజితా' దేవిని పూజించి, రావణుని సహరించి, విజయము పొందినాడు.

తెలంగాణా ప్రాంతమందు శమీపూజ అనంతరం 'పాలపిట్ట'ను చూచే ఆచారం కూడా ఉన్నది.

ఇలా అందరూ నవరాత్రులు జరుపుకుని, విజయదశమిరోజు సాయంత్రం నక్షత్ర దర్శన విజయ సమయాన శమీవృక్షం (జమ్మిచెట్టు) వద్దగల అపరాజితాదేవిని పూజించి, ఈ క్రింద ఇచ్చిన శ్లోకం స్మరిస్తూ చెట్టుకు ప్రదక్షణలుచేస్తారు.

శ్లో" శమీ శమయతే పాపం శమీశతృ నివారిణీ |

అర్జునస్య ధనుర్థారీ రామస్య ప్రియదర్శినీ ||

పైశ్లోకము వ్రాసుకున్న చీటీలు అందరూ ఆ చెట్టు కొమ్మలకు తగిలిస్తారు. ఇలా చేయుటవల్ల అమ్మవారి కృపతో పాటు, శనిదోష నివారణ కూడా జరుగుతుందని ప్రతీతి.

మహర్నవమి

మానవకోటిని పునీతులను చేయుటకు భగీరదుడు గంగను భువినుండి దివికి తెచ్చినది ఈనాడే. ఇక ఈనవరాత్రి దీక్షలో అతి ముఖ్యమైనదిగా ఈనవమి తిధిని గూర్చి చెప్పుటలో ఆంతర్యం ఈ తొమ్మిదవ రోజు మంత్ర సిద్ది కలుగును. కావున 'సిద్ధదా' అని నవమికి పేరు. దేవి ఉపాసకులు అంతవరకు వారు చేసిన జపసంఖ్య ఆధారంగా హోమాలుచేస్తూ ఉంటారు. అలా వ్రతసమాప్తి గావించిన వారికి సర్వసిద్ధుల సర్వాభీష్ట సంసిద్ధి కలుగును. ఇక క్షత్రియులు, కార్మికులు, వాహన యజమానులు, ఇతర కులవృత్తులవారు అందరూ ఆయుధపూజ నిర్వహిస్తారు.

దుర్గాష్టమి

దుర్గాష్టమి
దుర్గాదేవి "లోహుడు" అనే రాక్షసుని వధిస్తే లోహం పుట్టిందని, అందువల్ల లోహపరికరాలని పూజించే ఆనవాయతి వచ్చింది అని చెప్తారు. ఇక దుర్గ అంటే? దుర్గమైనది దుర్గ. దుర్గతులను తొలగించేది దుర్గ. ఈమె దుర్గేయురాలు కనుక దుర్గ అయింది. "దుర్గలోని 'దుర్' అంటే దుఃఖం, దుర్భిక్షం, దుర్వ్యసనం, దారిద్ర్యం మొదలైనవి. 'గ' అంటే నశింపచేసేది", అని దైవజ్ఞులు వివరణ చెప్తూ ఉంటారు. ఈమె ఆరాధనవల్ల దుష్టశక్తులు, భూత, ప్రేత, పిశాచ, రక్కసుల బాధలు దరిచేరవు, చేరలేవు. అందువల్లనే మొదటి మూడు రోజులు దుర్గారూపాన్ని ఆరాధించి అరిషడ్వర్గాలను, తదుపరి మూడురోజులు లక్ష్మిరూపాన్ని ఆరాధించి సిరిసంపదలను, చివరి మూడురోజులు సరస్వతిరూపాన్ని ఆరాధించి జ్ఞానాన్ని, ఆక్రమంలో ఈ నవరాత్రులలో ఆతల్లిని ఆరాధించి తగు ఫలితాలు పొందవచ్చునని పెద్దలు చెప్తుంటారు. ఈరోజు దుర్గసహస్రనామ పారాయణము, 'దుం' అను బీజాక్షరముతో కలిపి దుర్గాదేవిని పూజిస్తారు. "ఈదుర్గాష్టమి మంగళవారంతో కలిసిన మరింత శ్రేష్టము", అని అంటారు.


దేవీ నవరాత్రులు

దుర్గాష్టమి
ఆశ్వయుజ మాసం శుక్లపక్షంలో మొదటి తొమ్మిది రోజులనూ 'దసరా' లేక 'దేవీ నవరాత్రులు' అంటారు. ఈ తొమ్మిది రోజుల్లో చివరి మూడురోజులు దుర్గాష్టమి, మహర్నవమి, విజయదశమి. విద్యార్ధులు పుస్తకపూజ, శ్రామికులు పనిముట్లపూజ, క్షత్రియులు ఆయుధపూజ చేసి, అమ్మవారి కృపకు పాత్రులు అవుతారు. దేవి మహిషాసురమర్దనిగా రాక్షసుని మీదకు దండెత్తి విజయం సాధించిన స్పూర్తితో, పూర్వం రాజులు ఈశుభ ముహూర్తాన్నే దండయాత్రలకు ఎంచుకొనే వారని పురాణాల్లో చెప్పబడింది. కొన్ని ప్రాంతాలలో దసరాకు ఒక వేడుకగా బొమ్మల కొలువు పెట్టే ఆచారం ఉంది.

దేవదానవులు పాలసముద్రమును మధించినప్పుడు అమృతం జనించిన శుభముహూర్తదినం ఈ విజయదశమి రోజే అని తెలియజేయబడింది. 'శ్రవణా' నక్షత్రంతో కలసిన ఆశ్వీయుజ దశమికి 'విజయా' అనే సంకేతమున్నది. అందుకనే దీనికి 'విజయదశమి' అనుపేరు వచ్చినది. ఏపనైనా తిధి, వారము, తారాబలము, గ్రహబలము, ముహూర్తము మున్నగునవి విచారించకుండా, విజయదశమినాడు చేపట్టినచో ఆ కార్యమున విజయము తధ్యము. 'చతుర్వర్గ చింతామణి' అనే ఉద్గ్రంధము ఆశ్వీయుజ శుక్ల దశమినాటి నక్షత్రోదయ వేళనే 'విజయం' అని తెలిపియున్నది. ఈ పవిత్ర సమయము సకల వాంచితార్ధ సాధకమైనదని గురువాక్యము.

'శమీపూజ' చేసుకునే ఈరోజు మరింత ముఖ్యమైనది. శమీవృక్షమంటే 'జమ్మిచెట్టు'. అజ్ఞాతవాసమందున్న పాండవులు వారివారి ఆయుధములను, వస్త్రములను శమీవృక్షముపై దాచి వుంచారు. అజ్ఞాతవాసము పూర్తి అవగానే ఆ వృక్ష రూపమును పూజించి ప్రార్ధించి, తిరిగి ఆయుధాలను వస్త్రములను పొంది, శమీవృక్ష రుపమున ఉన్న 'అపరాజితా' దేవి ఆశీస్సులు పొంది, కౌరవులపై విజయము సాధించినారు.

శ్రీరాముడు ఈ విజయదశమి రోజున ఈ 'అపరాజితా' దేవిని పూజించి, రావణుని సహరించి, విజయము పొందినాడు.

తెలంగాణా ప్రాంతమందు శమీపూజ అనంతరం 'పాలపిట్ట'ను చూచే ఆచారం కూడా ఉన్నది.

ఇలా అందరూ నవరాత్రులు జరుపుకుని, విజయదశమిరోజు సాయంత్రం నక్షత్ర దర్శన విజయ సమయాన శమీవృక్షం (జమ్మిచెట్టు) వద్దగల అపరాజితాదేవిని పూజించి, ఈ క్రింద ఇచ్చిన శ్లోకం స్మరిస్తూ చెట్టుకు ప్రదక్షణలుచేస్తారు.

శ్లో" శమీ శమయతే పాపం శమీశతృ నివారిణీ |

అర్జునస్య ధనుర్థారీ రామస్య ప్రియదర్శినీ ||

పైశ్లోకము వ్రాసుకున్న చీటీలు అందరూ ఆ చెట్టు కొమ్మలకు తగిలిస్తారు. ఇలా చేయుటవల్ల అమ్మవారి కృపతో పాటు, శనిదోష నివారణ కూడా జరుగుతుందని ప్రతీతి.