దేవీ నవరాత్రులు

దుర్గాష్టమి
ఆశ్వయుజ మాసం శుక్లపక్షంలో మొదటి తొమ్మిది రోజులనూ 'దసరా' లేక 'దేవీ నవరాత్రులు' అంటారు. ఈ తొమ్మిది రోజుల్లో చివరి మూడురోజులు దుర్గాష్టమి, మహర్నవమి, విజయదశమి. విద్యార్ధులు పుస్తకపూజ, శ్రామికులు పనిముట్లపూజ, క్షత్రియులు ఆయుధపూజ చేసి, అమ్మవారి కృపకు పాత్రులు అవుతారు. దేవి మహిషాసురమర్దనిగా రాక్షసుని మీదకు దండెత్తి విజయం సాధించిన స్పూర్తితో, పూర్వం రాజులు ఈశుభ ముహూర్తాన్నే దండయాత్రలకు ఎంచుకొనే వారని పురాణాల్లో చెప్పబడింది. కొన్ని ప్రాంతాలలో దసరాకు ఒక వేడుకగా బొమ్మల కొలువు పెట్టే ఆచారం ఉంది.

దేవదానవులు పాలసముద్రమును మధించినప్పుడు అమృతం జనించిన శుభముహూర్తదినం ఈ విజయదశమి రోజే అని తెలియజేయబడింది. 'శ్రవణా' నక్షత్రంతో కలసిన ఆశ్వీయుజ దశమికి 'విజయా' అనే సంకేతమున్నది. అందుకనే దీనికి 'విజయదశమి' అనుపేరు వచ్చినది. ఏపనైనా తిధి, వారము, తారాబలము, గ్రహబలము, ముహూర్తము మున్నగునవి విచారించకుండా, విజయదశమినాడు చేపట్టినచో ఆ కార్యమున విజయము తధ్యము. 'చతుర్వర్గ చింతామణి' అనే ఉద్గ్రంధము ఆశ్వీయుజ శుక్ల దశమినాటి నక్షత్రోదయ వేళనే 'విజయం' అని తెలిపియున్నది. ఈ పవిత్ర సమయము సకల వాంచితార్ధ సాధకమైనదని గురువాక్యము.

'శమీపూజ' చేసుకునే ఈరోజు మరింత ముఖ్యమైనది. శమీవృక్షమంటే 'జమ్మిచెట్టు'. అజ్ఞాతవాసమందున్న పాండవులు వారివారి ఆయుధములను, వస్త్రములను శమీవృక్షముపై దాచి వుంచారు. అజ్ఞాతవాసము పూర్తి అవగానే ఆ వృక్ష రూపమును పూజించి ప్రార్ధించి, తిరిగి ఆయుధాలను వస్త్రములను పొంది, శమీవృక్ష రుపమున ఉన్న 'అపరాజితా' దేవి ఆశీస్సులు పొంది, కౌరవులపై విజయము సాధించినారు.

శ్రీరాముడు ఈ విజయదశమి రోజున ఈ 'అపరాజితా' దేవిని పూజించి, రావణుని సహరించి, విజయము పొందినాడు.

తెలంగాణా ప్రాంతమందు శమీపూజ అనంతరం 'పాలపిట్ట'ను చూచే ఆచారం కూడా ఉన్నది.

ఇలా అందరూ నవరాత్రులు జరుపుకుని, విజయదశమిరోజు సాయంత్రం నక్షత్ర దర్శన విజయ సమయాన శమీవృక్షం (జమ్మిచెట్టు) వద్దగల అపరాజితాదేవిని పూజించి, ఈ క్రింద ఇచ్చిన శ్లోకం స్మరిస్తూ చెట్టుకు ప్రదక్షణలుచేస్తారు.

శ్లో" శమీ శమయతే పాపం శమీశతృ నివారిణీ |

అర్జునస్య ధనుర్థారీ రామస్య ప్రియదర్శినీ ||

పైశ్లోకము వ్రాసుకున్న చీటీలు అందరూ ఆ చెట్టు కొమ్మలకు తగిలిస్తారు. ఇలా చేయుటవల్ల అమ్మవారి కృపతో పాటు, శనిదోష నివారణ కూడా జరుగుతుందని ప్రతీతి.

కామెంట్‌లు లేవు: