మహాలయ పక్షము

భాద్రపద మాసంలోని కృష్ణపక్షం పితృదేవతలకు అత్యంత ఇష్టమైన కాలం అని ప్రతీతి. అందుకే దీనిని పితృపక్షంగా వ్యవహరిస్తారు. పూర్వం దేవదానవులకు భాద్రపద పాడ్యమి నుంచి అమావాస్య దాకా యుద్ధం జరిగింది. ఆ నెలరోజుల్లోని రెండో సగంలో ఎంతో మంది దేవతలూ మునులూ మరణించారు. కాబట్టి దాన్ని 'మహాలయం' అనారు. అదే 'మహాలయ పక్షం' అయింది. అందుకే ఈ పదిహేనురోజులూ శుభకార్యాలకు పనికిరాదు. ఈ పక్షమంతటా నిత్యం తర్పణాలు వదలడం, శ్రాద్ధ విధులు నిర్వహించడం, పిండప్రదానం చేయడం ద్వారా పితృదేవతలను ఆరాధించాలని పురాణప్రవచనం. అలా పక్షమంతా చేయడం కుదరని వారు మహాలయ అమావాస్య నాడైనా అన్నశ్రాద్ధం పెట్టాలనీ అదీ కుదరనివారు హిరణ్యశ్రాద్ధం చేయవచ్చనీ... అది కూడా చేసే తాహతులేనివారు పితృదేవతలను తలచుకుని కన్నీరైనా కార్చాలని ధర్మశాస్త్రాలు చెబుతున్నాయి. 

భాద్రపద బహుళంలో వచ్చే మరో పండుగ ఉండ్రాళ్ల తదియ ప్రత్యేకించి కన్నెపిల్లలు... ఈ రోజున గౌరీదేవిని పూజించి ఉండ్రాళ్లు నైవేద్యం పెడతారు. అలాగే ఈ పక్షంలో వచ్చే ఏకాదశిని అజ ఏకాదశి అంటారు. పూర్వం భార్యాబిడ్డల్నీ రాజ్యాన్నీ పోగొట్టుకున్న సత్యహరిశ్చంద్రుడు అజైకాదశీ వ్రతాన్ని ఆచరించే పూర్వపు వైభవాన్ని పొందాడని నమ్మిక.

కామెంట్‌లు లేవు: