శ్రీరామనవమి


దుష్టశిక్షణ శిష్టరక్షణార్ధమై చైత్రశుద్ద దశమినాడు ఐదుగ్రహాలు ఉచ్ఛస్థితిలో ఉన్నకాలమందు పునర్వసు నక్షత్రంతో కూడిన కర్కాటక లగ్నంలో పగటి సమయాన సాక్షాత్తు ఆ శ్రీహరియే కౌసల్యాపుత్రుడై ఈ భూమిపైన జన్మించిన పర్వదినాన్ని మనం 'శ్రీరామనవమి' గా విశేషంగా జరుపుకుంటాం.

'రామ' యనగా రమించుట అని అర్ధం. కావున మనము ఎల్లప్పుడు మన హృదయకమలమందు వెలుగొందుచున్న 'ఆ శ్రీరాముని' కనుగొనుచుండవలెను శ్రీరామ

ఒకసారి పార్వతీదేవి పరమశివుని 'కేనోపాయేన లఘునా విష్ణోర్నామ సహస్రకం' అని, విష్ణు సహస్రనామ స్తోత్రంనకు కాస్త సూక్ష్మమైన మార్గం చెప్పమని కోరుతుంది. దానికి పరమేశ్వరుడు, "ఓ పార్వతీ! నేను నిరంతరము ఆ ఫలితము కొరకు జపించేది ఇదే సుమా!" అని ఈ క్రింది శ్లోకంతో మంత్రోపాసనచేస్తాడు.


శ్లో|| శ్రీ రామ రామ రామేతి రమే రామే మనోరమే |

      సహస్ర నామతత్తుల్యం రామనామ వరాననే ||

ఈ శ్లోకం మూడుమార్లు స్మరించితే ఒక్క విష్ణు సహస్రనామ పారాయణ ఫలితమేకాదు, భక్తులకు శివసహస్రనామ ఫలితం కూడా లభిస్తుంది. ఏ భక్తులు కాశీలో జీవిస్తూ ఆ పుణ్యక్షేత్రమందు మరణిస్తారో వారి మరణ సమయాన ఆ భక్తవశంకరుడే ఈతారకమంత్రం వారి కుడి చెవిలో చెప్పి వార్కి సధ్గతి కలిగిస్తారన్నది భక్తుల ప్రగాఢ విశ్వాసం.

ఇక భక్త రామదాసు అయితే సరేసరి! శ్రీరామనామ గానమధుపానాన్ని భక్తితో సేవించి, శ్రీరామ నీనామ మేమి రుచిరా... ఎంతోరుచిరా... మరి ఎంతో రుచిరా... అని కీర్తించాడు. మనం శ్రీరామనామాన్ని ఉచ్ఛరించేటప్పుడు 'రా' అనగానే మన నోరు తెరచుకుని మనలోపల పాపాలన్ని బయటకు వచ్చి ఆ రామనామ అగ్నిజ్వాలలో పడి దహించుకుపోతాయట! అలాగనే 'మ' అనే అక్షరం ఉచ్ఛరించినప్పుడు మననోరు మూసుకుంటుంది కనుక బయట మనకు కనిపించే ఆ పాపాలు ఏవీ మనలోకి ప్రవేశించలేవట. అందువల్లనే మానవులకు 'రామనామ స్మరణ' మిక్కిలి జ్ఞానాన్ని, జన్మరాహిత్యాన్ని కలిగిస్తుందట!

శ్రీరామనవమి రోజున వీధులలో పెద్ద పెద్ద పందిళ్ళు వేసి సీతారామ కళ్యాణం చేస్తారు. ఇళ్ళల్లో కూడా యధాశక్తిగా రాముని పూజించి వడపప్పు, పానకం, నైవేద్యం చేసి అందరకీ పంచుతారు.

కామెంట్‌లు లేవు: