పరశురామ జయంతి


ప్రాచీన కాలమున పృధ్విపై హైహయ వంశీయ క్షత్రియుల అత్యాచారములు ప్రబలి యుండెను. నాలుగు వైపుల హాహాకారములు చెలరేగుచుండెను. గోవులకు, బ్రాహ్మణులకు, సాధువులకు రక్షణలేకుండెను. ఇట్టి స్థితియందు భగవానుడు పరశురామ రూపముతో జమదగ్ని ఋషి పత్ని అయిన రేణుక గర్భమున అవతరించెను. అప్పుడు హైహయ వంశములో సహస్ర బాహు డర్జునుడను రాజుండెను. ఇతడు అతి క్రూరముగ శాసనము చేయుచుండెను. ఒక పర్యాయము ఇతడు జమదగ్ని ఆశ్రమమునకు వచ్చెను. ఆశ్రమ మందున్న చెట్లను పడగొట్టి జమదగ్ని చెంతనున్న కామధేనువును తీసికొని వెళ్ళెను. పరశురామునకు ఈ విషయము తెలిసి కార్తవీర్యార్జునుని వధించెను. అతని మరణానంతరము అతని మరణానంతరము అతని పుత్రులు 10వేల మంది భయపడి పారిపోయిరి.
ఒక దినము పరశురాముడు సోదరులతో కలిసి, ఆస్రమము నుండి వెలుపలకు వెళ్ళెను. అనుకూల సమయమునకు ఎదురు చూవుచున్న కార్తవీర్యుని పుత్రులు అచటకి వచ్చి ఒంటరిగా నున్నా జమదగ్ని మహర్షిని వధించిరి. రేణుక తలబాదుకొనుచు గట్టగ విలపించసాగెను. పరశురాముడు తల్లి రోదనను విని అతి వేగముగ ఆశ్రమమునకు వచ్చెను. మరణించియున్న తండ్రిని చూచి దుఃఖించెను. పరశురాముడు క్రోథితుడై తండ్రి శరీరమును సోదరుల కప్పగించి చేత గొడ్డలి ధరించి క్షత్రియ సంహారము గావించుటకు నిశ్చయించుకొనెను. అప్పటి క్షత్రియులు అత్యాచారులుగ నుండిరి. అందుచేత పరశురాముడు తన తండ్రి మృతిని నిమిత్తమాత్రముగ చేసికొని 21 మారులు భూమి యందున్న క్షత్రియులను వధించెను.

ఈ విషయమున మరొక కారణము కూడా కలదు. తండ్రి మరణించినప్పుడు తన తల్లి ఇరువది ఒక్కమారులు తన పొట్ట గ్రుద్దుకొనుచు విలపించినదట. ఈ కారణముచేత 21 మారులు క్షత్రియ వధ జరిపెనని ఒక పురాణమున గలదు. ఈ విధముగా భగవానుడు భృగుకుల మందు అవతరించి భూమికి భారముగ నున్న అనేక రాజులను వధించెను. అనంతరము తన తండ్రిని జీవింపజేసి సప్తర్షి మండలమందు సప్తర్షులలో నొకనిని జేసెను. ఆ తరువాత పరుశురాముడు యజ్ఞమందు సమస్త భూ మండాలమును దాన మెసగి మహేంద్ర గిరిపైకి వెళ్లెను.

కామెంట్‌లు లేవు: