అక్షయ తృతీయ


ఈనాడు మనం 21వ శతాబ్దంలోకి అడుగు పెట్టాము. ఇది ఎంతో స్పీడు యుగం, అయినప్పటికి ఈ జీవితాన్ని ఆదర్శవంతంగా తీర్చిదిద్దుకునేందుకు చివరిగా పరమేశ్వర సాయుజ్యం పొందేందుకు మన హిందూ సంస్కృతి సంప్రదాయాలలో మన జీవిత గమ్యం గాడి తప్పకుండా ధర్మార్ధ కామ,మోక్షాల కొరకు చక్కని మార్గాన్ని తల్లి గర్భధారణ మొదలుకొని క్రమపద్ధతిలో జరిగే షోడశ సంస్కారాలతో మనకు ఆరంభమవుతాయి.అట్టి పూలబాటలో అలనాటి మన ఋషులు ఆదర్శవంతంగా ఆచరించి మనకు మార్గగమ్యాన్ని చూపించారు.ఆ బాటలోనివే ఈ నోములు వ్రత్రాలు,ఉపవాసాలు,పండుగలు అన్నవి.వాటికన్నిటికినీ యుగయుగాలనాటి చరిత్రతో మేళవించబడినవి. అటువంటి పండుగయే ఈ "అక్షయ తృతీయ-ఉగాది" పర్వదినం.

"వైశాఖమాసస్య చ యా తృతీయా నవమ్య సౌ కార్తీక శుక్లపక్షే

నభస్య మాసస్య తమిస్రపక్షే త్రయోదశీ పంచదశీ చ మాఘే"

కావున ఇది కృతయుగ ఆరంభ ఉగాది అని విష్ణు పురాణాదులు పేర్కొనుచున్నవి.కొన్ని ప్రాంతములలో వైశాఖశుద్ధ తదియనాడు ఈ పండుగ చేయుచుందురు. ఈనాడే "బదరీనారాయణ" మందిర ద్వారములు భక్తుల దర్శన నిమిత్తం తిరిగి తెరుతురు.అంతవరకు ఈ ఆలయం మంచుతో నిండియుండి అగమ్య గోచరమైన ఈ హృషీకేశము భక్తులచే కిటకిటలాడుచు పూజాదికాలు ప్రారంభమగును.ఈ దినమున కొన్ని ప్రాంతములందు స్త్రీలు చిన్నికృష్ణునికి,గౌరీదేవికి డోలోత్సవము జరిపించి ముత్తైదువలను కన్యలను పూజించి ఫలపుష్పాదులు, శనగలు వాయనమిచ్చి సత్కరించెదరు.

ఈ పుణ్యదినమందు దేవతలను,పితృదేవతలను ఆరాధించుట, గోదానము, భూదానము, సువర్ణదానము, వస్త్రదానము, పూర్ణఘటముతో నిండియున్న ఉదక దానము మున్నగునవి, మరియు ఈ దినమందు చేయు జప, హొమ, దానాదులన్నియు "అక్షయము" పొందునుగాన! ఇది "అక్షయతృతీయ" మని కృష్ణభగవానుడు స్వయముగా ధర్మరాజుకు వివరించినాడు.

ఇందులకొక పురాణగాధకలదు.పూర్వము ఒక వైశ్యుడు ఎన్నో దారిద్ర్య బాధలు వెంటాడుతున్నా; సత్ప్రవర్తన వీడక జీవించుచు ఒకసారి ఒక పౌరాణికుడు "వైశాఖశుద్ధ తృతీయ నాడు చేయు స్వల్పదానమైనను అక్షయ ఫలప్రదము" అని చెప్పగా విని, ఆ దినమందు గంగలో పుణ్యస్నానమాచరించి దేవతలకు, పితృదేవలకు తర్పణమాచరించి, ఇంటికి వచ్చి సద్‌బ్రాహ్మణులను ఆహ్వానించి వారికి యథాశక్తి భోజన తాంబూలాదులతో దానమిచ్చెను.అలా ఆచరించిన పుణ్యఫలమే వాని వెంటవచ్చి మరుజన్మమున అతడు కుశావతీ నగరమునకు రాజుగా జన్మించెను.అయినను అతడు ఎన్నో యజ్ఞయాగాదులు, దానధర్మాలు నిర్వర్తించుచున్నను వాని సంపద అక్షయమగుటే గాని తరుగలేదుట. "అందువల్లనే మన పౌరాణికుల మాటలు పెడచెవిని పెట్టకుండా, విశ్వసించే వారికి విశ్వసించినంత ఫలం ఉంటుందని పెద్దలు చెప్తూ ఉంటారు.

"వైశాఖ శుక్ల పక్షేతు తృతీయా రోహిణి యుతా,

దుర్లభా బుధచారేణ సోమనాపి యుతా తథా"

వైశాఖ శుక్లపక్ష తృతీయ రోహిణీయుతమైన అత్యంత పుణ్యప్రదమైనది అని విష్ణుపురాణాదులు చెప్పుచున్నవని,పరమభాగవతోత్తముడు నారదీయవచనమును నిర్ణయామృతకారుడు ఉదహరించినాడు. అట్టి పుణ్య ఫలాన్ని అందించే ఈ అక్షయ తృతీయను భక్తి శ్రద్ధలతో ఆచరించి సర్వులము పునీతులౌదాము.

కామెంట్‌లు లేవు: