
దక్షిణ భారతదేశమంతా మూడు రోజులపాటు జరుపుకునే దీపావళి ఎంతో ఉత్తేజకరమైన పండుగ. ఆశ్వయుజ బహుళ చతుర్దశి, అమావాస్య, కార్తీక శుద్ధ పాఢ్యమి మూడు రోజులనూ కలిసి సమగ్రమైన దీపావళి. ఈ మూడు రోజుల్లో మొదటిది నరక చతుర్దశి. రెండవది దీపావళి. మూడవది బలిపాడ్యమి.


శ్రీకృష్ణుడు సత్యభామ సమేతుడై లోకకంటకుడైన నరకాసురుని వధించినందుకు సంబరంగా జరుపుకొనే ఈ దీపావళి పండుగను దేవదానవులు పాలసముద్రాన్ని మధించినప్పుడు వచ్చిన దివ్యజ్యోతి ఈ జీవకోటికి వెలుగును ప్రసాదించిన విశిష్టమైన రోజుగా మరియు శ్రీరామచంద్రుడు రావణ సంహారం గావించి సీతాదేవితో అయోధ్యకు చేరి పట్టాభిషిక్తుడైన శుభసందర్భంగా కూడా చెప్పుకుంటారు.
దీపావళికి దేదీప్యమైన దివ్యకాంతుల దీపాలను అలంకరించి, బాణాసంచా కాలుస్తూ, అందరూ వారి వారి ఆనందాలను వ్యక్త పరుస్తూ ఉంటారు. ఇక ప్రకృతి పరంగా ఆలోచిస్తే, ఈ కాలమందు సర్వజీవులను వ్యాధిగ్రస్తులను చేసే కీటకాలు, పంటలను నాశనము చేసే క్రిమికీటకాలు అధికంగా ఉధ్బవిస్తాయి. కనుక ఈ బాణాసంచా కాల్పుల వల్ల కీటకసంహారం కలిగి ప్రజలకు అన్నివిధాల మేలు జరుగుటకే ఈఆచారం పెట్టి ఉంటారని పెద్దలు చెప్తూ ఉంటారు.

కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి