కల్కిజయంతి

మన ధర్మ శాస్త్రములందు కల్కి భగవానుని అవతారము దశావతారముగ చెప్పబడినది. ఘోర కలియుగము ఎప్పుడైతే వచ్చునో అప్పుడు ధర్మము, సత్యము పవిత్రత, క్షమ, దయ, ఆయువు, బలములు, నశించును. కలియుగమందు ఎవరి చెంత ధనముండునో వారినే కులీనులు, సదాచారులు, సద్గుణవంతులుగా తలచెదరు. వీరు మోసము, కపటముగ వ్యవహరించిననూ మంచిగనే భావించెదరు. బ్రాహ్మణుల స్వభావము కూడా మారిపోవును. వీరి యజ్ఞోపవీతమును చూచి బ్రాహ్మణులను కొనెదరు. వీరు అధిక దర్పముతో మూర్ఖులై యుందురు. 

కలియుగమున ధర్మము కీర్తికొరకు చేయుదురు. సమస్త పృధ్వి దుష్టులతో నిండిపోవును. రాజగుట యేనియమములు అవసరము లేకుండును. బ్రాహ్మణులు గాని, క్షత్రియులుగాని, వైశ్యులుగాని, శూద్రులుగాని, ఎవరు బలవంతులైనవారే రాజులగుదురు. కలియుగమున రాజులు అతి నిర్దయములుగను, క్రూరులుగను నుందురు. వీరికి భయపడి ప్రజలు పర్వతములకు, అడవులకు పారిపోవుదురు. ఈ సమయమున భయంకరమైన కరువు సంభవించును. జనులు ఆకలి దప్పులతోను, నానాబాధలతో దు:ఖితులగుదురు. అప్పుడు వీరు ఆకులు తిని కడుపు నింపుకొనెదరు. మనుష్యులు దొంగతనము, హింసాది కుకర్మలతో కలము గడుపుదురు. కలికాల దోషమున మానవుల శరీర నిర్మాణము చిన్నదగును. నాలుగు వర్ణములవారు శూద్రులతో సమానమగుదురు. గోవులు మేకలవలె కొంచెము పాలను ఇచ్చును. వానప్రస్ధులు, సన్యాసులు గృహస్ధులవలె వ్యవహరించెదరు. ధర్మశాస్త్రములను, వేదపురాణములను నిందించెదరు. పూజ, పఠనాదులను బూటకమనెదరు. కలియుగాంతమున పృధ్విపై హింస, జాతీయ సంఘర్షణలు పెచ్చు పెరుగును. ఇట్టి సమయమున ధర్మమును రక్షించుటకు స్వయముగ భగవానుడు అవతరించును. 

కలియుగాంతమున శంభల గ్రామమందు విష్ణుయశుడను ఒక బ్రాహ్మణుడుండును. ఇతడు గొప్ప ఉదారుడు. పరమభక్తుడు ఇతని భార్య సుమతి గర్భమున వైశాఖమాస శుక్ల ద్వాదశీ దినమున కల్కి భగవానుడు అవతరించును. ఇతడు దేవదత్త నామము గల అశ్వముపై నెక్కి దుష్టులతో ఖడ్గముతో ఖండించును. పృధ్వీపై పున:ధర్మమును స్ధాపించును. కల్కి భగవానుని అవతరణ సమయమున సత్యయుగము ప్రారంభమగును. ప్రజులు సుఖశాంతులతో జీవించెదరు.

కామెంట్‌లు లేవు: