సకల శుభములు చేకూర్చే అనంతపద్మనాభ చతుర్దశి


ప్రతీ సంవత్సరము భాద్రపద మాసమందు పూర్ణిమతో కూడియున్న చతుర్దశినాడు ఈ "అనంత పద్మనాభవ్రతము" ను చేయుట ఎంతో మంచిది అని మనకు భవిష్య పురాణము నిర్దేశించి చెప్పుచున్నది. కావున ఈ చతుర్దశి అనంతపద్మనాభ చతుర్దశి అయినది. ఇంతకీ అసలు ఈ అనంతుడు ఎవరు? ఎందులకు ఈవ్రతమాచరించాలి? లోగడ ఈవ్రతమాచరించి సత్ఫలితములు పొందినవారు ఎవరైనా ఉన్నరా? అని వెంటనే మనకు కలిగే సందేహాలను నివృత్తిచేసుకునే ప్రయత్నం ఒక్కసారి చేద్దాం....!

పూర్వం జూదంలో ఓడిపోయి వనవాసము చేస్తూ ఎన్నో ఈతిబాధలు అనుభవిస్తూ దిక్కుతోచని స్ధితిలో ఉన్న పాండవ అగ్రజుడు ధర్మరాజు శ్రీకృష్ణుని చూచి "ఓ జగద్రక్షకా! మేము అనుభవించుచున్న ఈ మన:క్లేశములనుండి దూరమై సుఖానందములు పొందుటకు ఏదైనా మార్గము సెలవీయ"మని ప్రార్ధించగా! అందులకు కృష్ణుడు భాద్రపద శుక్ల చతుర్దశినాడు అనుష్టించదగిన "అనంత పద్మనాభ వ్రతము అనునది ఒకటి కలదు. ఆ వ్రతము శ్రద్ధాభక్తులతో ఆచరించిన యెడల మీరు కష్టదూరులై సుఖభోగములను తిరిగి తప్పక పొందగలరు, అని కృష్ణుడు తెలిపెను. అందులకు ధర్మరాజుకు వెంటనే ముందుగా మనకు కలిగిన సందేహాలలో....ఇంతకీ ఈ అనంతుడు ఎవరు? బ్రహ్మయా? తక్షుడా? శేషుడా? పరమాత్మయా? అని వరుసగా ప్రశ్నించసాగెను.

"అనంత ఇత్యహం పార్ధ మమ రూపం నిబోధత,

ఆదిత్యాదిగ్రహాత్మాసౌయ : కాల ఇతి కధ్యతే

కాలా కాష్టా ముహూర్తాది దివారాత్ర శరీరవాన్‌,

పక్షమాసర్తు వర్షాదియుగకాల వ్యవస్ధయా,

యోయం కాలో మహాన్‌ ఖ్యాత: సో నంత ఇతికీర్త్యతే"

ఆ అనంతుడు అంటే మరి ఎవరోకాదు... నేనే, వానిని నారూపముగానే గ్రహించుకొనుము. సకల గ్రహాత్మకుడు మరియు ఆదిత్యుడు నేనే, పక్ష, మాస, ఋతువులుగా వ్యవహరింపబడే ఆ కాలపురుషుడు నేనే, కాలమే 'అనంతుడు'. అని కృష్ణపరమాత్మ బదులుపలికినాడు. మరి మున్నెవరైనా ఈ వ్రతమాచరించినారా?సవిస్తరముగా వివరించగోరుచున్నాను, అని ధర్మరాజు కోరగా! ఈ గాధను వివరించినాడు. పూర్వం కృతయుగమందు సుమంతుడు, దీక్ష అను బ్రాహ్మణ దంపతులు కలరు. వార్కి ఈ మహావిష్ణువు అనుగ్రహముతో ఒక కుమార్తె కలుగగా ఆ బాలికకు 'శీల' యను నామకరణముచేసి అల్లారుముద్దుగా పెంచుకోసాగినారు. కొంత కాలమునకు సుమంతుని భార్య 'దీక్ష' అనారోగ్యముతో మరణించగా వేరొక స్త్రీని వివాహమాడెను.

ఇలా ఉండగా రూపలావణ్యవతియైన 'శీల'ను కౌండిన్య మహర్షి వివహమాడదలచి సుమంతుని అంగీకారముతో ఆమెను వివాహమాడెను. అనంతరం శీలతో కలసి ఎడ్లబండిపై తిరుగు ప్రయాణమగుచు, మార్గమధ్యమున ఒక చెట్టునీదయందు బండిని ఆపి విశ్రాంతి తీసుకోసాగెను. ఇంతలో 'శీల' ఆ సమీపనదీతీరమందు కొందరు సువాసినులు ఏదో పూజలు చేయుటగాంచి వారివద్దకు చేరి మీరు చేయుచున్న ఈ పూజలు ఏముటి? అని ప్రశ్నించగా! వారు ఓ పుణ్యవతీ! ఇది "అనంత పద్మనాభవ్రతం" ఈ రోజు కనుక విధి విధానంగా ఆ నారాయణుని ఆరాధించి, ఆ ఆరాధనలో ఉంచిన పదునాలుగు ముళ్ళుకలిగిన పట్టుత్రాడు తోరము భర్త భార్య ఎడమచేతికి, భార్య భర్తకుడి చేతికి కట్టుకుని ధరించిన యెడల అష్ట్తెశ్వర్యములతో సుఖభోగములొందగలరు అని ఆ వ్రతమహాత్మ్యము వివరించగా, వారు ఇచ్చిన తోరము ధరించి కౌండిన్య మహర్షి వద్దకు రాగానే, మహర్షి ఆమె చేతినిఉన్న తోరమును చూచి మిక్కిలి ఆగ్రహించి నన్ను వశీకరించు కొనుటకై ఈ తోరముకట్టు కొనియున్నావా? అని కేకలు వేయుచు ఆమెచేతిని ఉన్న తోరమును త్రెంచి నిప్పులవైపునకు విసరివేస్తూ "అమె ఇది అనంత పద్మనాభుని యొక్క వ్రతతోరము" అని బ్రతిమాలినా! పెడచెవిని పెట్టి విసవిస అచ్చట నుండి కడు ఆగ్రహంతో వెడలిపోయినాడు. శీల ఆ తోరము పాలలో వేసి భద్రపరచెను.

ఆ క్షణమునుండి కౌండిన్యుడు సకల సంపదలను కోల్పోయి నిర్ధనుడాయెను. తిరిగి పశ్చాత్తాప మనస్కుడై దీనికి మార్గమేమి? అని భార్యనడుగగా, మీరు ఒనర్చిన "అనంతవ్రతాక్షేపణ దుష్ఫలమే" యిది. తిరిగి వారి అనుగ్రహపాత్రులమవుతేగాని ఈ క్లేశములు మనలను వీడవు అని హితవు చెప్పెను.

అందులకు కౌండిన్యుడు అనంతుని సంతోష పెట్టుటకై అరణ్యమున కేగి తపమాచరిస్తూ, ఆ అనంత పద్మనాభునికై పశ్చాత్తాప్తుడై వెదకనారంభించి, చెట్టనక పుట్ట్నక, వాగనక వంకనక, పశువులనక, పక్షులనక ఆ పరమాత్మజాడ తెలుపమని ప్రశ్నిస్తూ వేయికనులతో నిరీక్షిస్తున్న ఆ కౌండిన్యుపై దయార్ద్రహృదయముకిలిగిన శ్రీమహావిష్ణువు ప్రత్యక్షమవగానే!

సశంఖచక్రం సకీరీటకుణ్డలం సపీత వస్త్రం సరసీరు హేక్షణమ్‌,

సహారవక్షస్ధలశోభి కౌస్తుభం నమామి విష్ణుం శిరసాచతుర్బుజమ్‌.

అని శ్రీ మహావిష్ణువుని స్తోత్రముచేసి సాగిలపడి తనయపరాధములను మన్నింపమని వేడుకొనెను. అందులకు అనంతుడు అనుగ్రహించి, ఓ బ్రాహ్మణోత్తమా! నీవు చింతించవలదు. వెంటనే నీ గృహమునకేగి పిదప పదునాలుగు సంవత్సరములు అనంత చతుర్దశీ వ్రతమాచరింపుము. ఆ రోజు ధరించిన తోరము సకల శుభములను చేకూర్చుచూ అష్ట్తెశ్వర్యములు ప్రసాదించును అని అనుగ్రహించెను. అట్టి అనంతపద్మనాభ చతుర్దశి వ్రతమాచరించి సర్వులమూ పునీతుల మౌదాము.

కామెంట్‌లు లేవు: