వామన జయంతి

ఒకానొక సమయమున యుద్దమున దైత్యరాజు బలి, ఇంద్రుని వలన పరాజయము పొంది గురువైన శుక్రాచార్యుని శరణువేడెను. కొంతకాలము గడిచిన తరువాత గురుకృప వలన బలి స్వర్గముపై అధికారము సంపాదించెను. భగవానుని మహిమ విచిత్రముగ నుండును. నిన్నటి దేవరాజు ఇంద్రుడు, నేడు బికారి అయ్యెను. ఇతడు తన తల్లి అదితిని శరణు వేడెను. ఇంద్రుని దశను గాంచిన తల్లి దు:ఖించి పయోవ్రతానుస్టానమును చేసెను. 

వ్రత అంతిమ దినమున భగవానుడు ప్రత్యక్షమం అదితితో "దే్వీ! చింతించకుము. నేను నీకుఇ పుత్రునిగ జన్మించి ఇంద్రునికి చిన్న తమ్మునిగ నుండి వానికి శుభము చేకూర్చెదను" అని పలికి అంతర్దానమయ్యెను. 

ఆ శుభఘడియ సమీపించెను. అదితి గర్భమున భగవానుడు వామన రూపమున జన్మించెను. భగవానుని పుత్రునిగా పొందిన అదితి సంతోషమునకు అంతులేదు. భగవానుని వామనుడగు బ్రహ్మచారి రుపమున దర్శించిన మహర్షులు, దేవతలు ఎంతో ఆనందించిరి. భగవానునకు ఉపనయన సంస్కారములు గావించిరి. 

బలి చక్రవర్తి బృగుకచ్చమను చోట అశ్వమేధ యజ్ఞము చేయుచున్నడని వామన భగవానుడు విని అచ్చటికి వెళ్ళెను. వామన భగవానుడు నడుమునకు ఒక విధమైన రెల్లుగడ్డితో మొలత్రాడును, యజ్ఞోపవీతమును ధరించి యుండెను. శరీరముపై మృగచర్మముండెను. శిరస్సుం జడలు ధరించి యుండెను. ఇట్టి మాయామయ బ్రహ్మచారి బ్రాహ్మణ రూపమున, బలి యజ్ణమంటప మందు ప్రవేశించెను. 

వీనిని చూచిన బలి హృదయము గద్గద మయ్యెను. వామనుని ఉత్తమ ఆసనముపై కూర్చుండబెట్టి పూజించెను. ఆ తరువాత బలి, వామనుని "ఏదైనా కోరుకొమ్మ"నెను. వామనుడు "మూడు పాదముల భూమిని" అడిగెను. 

శుక్రాచార్యుడు భగవానుని లీలనుగ్రహించెను. 'దానము వద్దని' చెప్పెను. ఐననూ బలి వినలేదు. దానమొసగుటకు సంకల్పము చేయ జలపాత్రను ఎత్తైను. శుక్రాచార్యుడు తన శిష్యుని మేలుకోరి జలపాత్ర మందు ప్రవేశించి జలము వచ్చు దారిని ఆపెను. వామన భగవానుడు ఒక దర్భను తీసికొని పాత్రలో నీరు వచ్చు దారిని చేదించెను. దానితో శుక్రాచార్యునకు ఒక కన్ను పోయెను. 

సంకల్పము పూర్తి అయిన వెంటనే వామన భగవానుడు ఒక పాదముతో పృద్విని, రెండవ పాదముతో స్వర్గలోకమును కొలిచెను. ముడవ పాదమునకు బలి తనకు తానే సమర్పితుడయ్యెను. బలి సమర్పణ భావమునకు భగవానుడు ప్రసన్నుడై బలికి సుతలలోక రాజ్యము నిచ్చెను. ఇంద్రునకు ఇందప్రదవి నొసగెను.

కామెంట్‌లు లేవు: