మకర సంక్రాంతికి - మకరజ్యోతి రూపంలో అయ్యప్పస్వామి

ప్రతి సంవత్సరం లక్షలాది మంది భక్తులను క్రమబద్దమైన రీతిలో నల్లని బట్టలు ధరింపజేసి, విలక్షణమైన రీతిలో కఠోరమైన దీక్షలు చేయించి, "స్వామియే శరణం అయ్యప్ప" అని శరణం చెప్పించుకుంటూ! భక్తులను కఠినశిలలపై బాధ తెలియని అఖిలాండ కోటి భక్తజనావళికి సదా ఆశీస్సులు అందించే ఆ అయ్యప్పస్వామి వారి జన్మ వృత్తాంతగాధ ఏమిటి? వారిని దర్శించుకోవటమెలా? అనే కుతూహలం మీకు ఉన్నదా?అసలు ఆ స్వామి చిన్ముద్రతో పట్టబంధాసనం లో తపస్సులో ఆసీనులైన తీరే! ముందు మనకు కలిగే మొదటి సందేహమవుతుంది. 

మానవుల భవబంధాలను త్రెంచి వారిని ముక్తి మార్గంలోకి మళ్ళించే సంకేతమే! ఈ చిన్ముద్రరూపంలోని భావం. ఇక మీరు ఎంతో ఆతృతగా ఎదురుచూస్తున్న స్వామివారి జన్మవృత్తంతగాధను పరిశీలిద్ధాం! దీనిపై కూడా విభిన్న రీతులలోగాధలు కానవస్తున్నాయి. భూత నాధోపాఖ్యానంలోనూ, బ్రహ్మండపురాణమందు అయ్యప్పస్వామివారి ప్రస్తావన ఉన్నట్లు భక్తులు చెప్తారు. బ్రహ్మ, విష్ణు, మహేశ్వర్లు భూలోకంలో ధర్మసంస్థాపన కావించాలి అని సంకల్పించి "దత్తాత్రేయుని" సృష్టిస్తారు. వానికి తోడుగా ఉండేందుకు ముగ్గురమ్మలు లక్ష్మీ, సరస్వతి, పార్వతీమాతలు వారి శక్తితో "యోగమాయను" "లీలావతిగా" సృష్టిస్తారు. అలా లీలావతి - దత్తస్వామి గృహస్ధాశ్రమాన్ని గడుపుచుండగా వారి అన్యోన్య దాంపత్యం మధ్య ఒక అపశృతి దొర్లుతుంది. 

అది దత్తస్వామికి తన కర్తవ్యమేమిటో జ్ఞానోదయమై సంసారంపట్ల విముఖతకల్గి వైరాగ్యాన్ని అవలంబించుట, దానితో మిక్కిలి ఆగ్రహించిన లీలావతి దత్తస్వామిని 'మహిషాసురుడనే' రాక్షసుడు కమ్మని శపిస్తుంది. అందులకు ప్రతిగా దత్తస్వామి లీలావతిని 'మహిషిగా' మారిపొమ్మని ప్రతిశాపమిస్తాడు. అలా వారు ఇరువురు వారి రాక్షస ప్రవర్తనతో! లోక కంటకులౌతారు. వారిలో మహిషాసురుని దుర్గాదేవి సంహరిస్తుంది. అందులకు మహిషి తన ప్రాణ సఖుని వధించినందులకు ప్రతీకారం తీర్చుకోవాలని బ్రహ్మను గూర్చి (ఘో)రమైన తపస్సుచేసి; తనకు హరి హరాదులకు కలిగిన బాలుడు తప్ప వేరెవరు తనను వధించకుండా వరమిమ్మని ప్రార్ధిస్తుంది. బ్రహ్మ 'తధాస్తు' అని అంతర్ధానమౌతాడు. 

పాపం ఇక్కడ మహిషి భావన! "హరి హరాదులు ఆలింగనం చేసుకున్నంత మాత్రాన బాలుడు కలుగడని, పోని కలిగినా! తన భయంకర రూపాన్ని చూచి బాలుడు తనను ఏమి చేయలేడని, భావించి ఉండవచ్చు నేమో! మరి. 

ఆ వర గర్వంతో, మహిషి దేవలోకాన్ని కొల్లగొట్టి దేవుళ్ళందరిని పలు ఇక్కట్లకు గురి చేస్తుంది. దానితో దేవేంద్రాది దేవతలు "శ్రీహరిని" ప్రార్ధిస్తారు. అప్పుడు శ్రీహరికి ఒక ఉపాయము తోచుతుంది. తాను లోగడ దేవ - దానవులు అమృతం కొరకు "క్షీరసాగరాన్ని" మధించినప్పుడు అందుండి లభ్యమైన అమృతాన్ని వారికి పంచే సమయాల్లో తాను ధరించిన "మోహిని అవతారాన్ని" పరమేశ్వరుడు మోహంతో చూచాడు. నేను తిరిగి ఆ అవతారము మరోమారు దాల్చితే పరమేశ్వరుడు తప్పకవచ్చి నన్ను ఆలింగనం చేసుకుంటాడు అని తలచి తిరిగి జగన్మోహినిగా అవతారముదాల్చి పరమేశ్వరుని దృష్టిపడు విధంగా! వనమందు సంచరించసాగాడు. తాను లోగడ చూచిన మోహిని తిరిగి కనిపించు సరికి శ్రీహరి ఆశించిన విధంగా! 'పరమేశ్వరుడూ వచ్చి ఆలింగనం చేసుకుంటాడు శ్రీమహావిష్ణువును. అలా వారి ఆలింగనలో ఇచ్చామాత్రంగానే అయొనిజుడైన బాలుడు కలుగుతాడు. ఆ బాలునకు సకల భూతాలపై ఆధిపత్యం వహించి భూతనాధుడు కమ్మని పరమేశ్వరుడు ఆశీర్వదించగా, శ్రీమహావిష్ణువు తన కౌస్తుభమణి సంకేతంగా ఒక మణిహారాన్ని ఆ బాలుని మెడలో వేస్తాడు. బ్రహ్మ ఆ బాలుని 'హరిహర పుత్రుడుగా ' ఆశీర్వదించి అంతర్ధానమవుతారు. 

ఇక్కడ ఒక విషయం గమనించండి, "జగద్తక్షకుడైన ఆ పరమేశ్వరునకు ఇంతటి మోహదృష్టి ఏమిటి? అని శంకించకండి, జగన్నాటక సూత్రధారులైన వారి లీలలు కేవలం లోకకళ్యాణార్ధమే తప్ప మనబోటి సామాన్యులకు అవి అర్ధంకావు. ముఖ్యంగా వారు ఇరువురు ఆశించేది మొదటిది 'మహిషి' మదమణచడంతో దేవతలకు మానవులకు ఆనందాన్ని ఇవ్వడం. రెండవది అభేదస్వరూపులమైన హరి హరాదుల మధ్య బేధభావంతో చూడకూడదు అని! భక్తులకు తెలియజేయుటయే వారి ఆత్మీయ ఆలింగనలోని భావంగా గ్రహించుకోవాలి. 

ఇలా ఉండగా! కేరళ దేశంలో 'పందళరాజ్యము' పాలించే భూపాలుడు రాజశేఖర పాండ్యునికి సంతానప్రాప్తి కరువైంది. అందులకై ఆతడు ఎన్నో యజ్ఞయాగాది క్రతువులు నిర్వహిస్తూ, ఒకసారి వేటకై తన పరివారాన్ని వెంటబెట్టుకుని పంపానదీతీరాన సర్పపడగ నీడన, కేరింతలు కొడుతూ చిరునవ్వులు చిందిస్తూ ఉన్న ఆ బాలుని, కేరింతలు విన్న ఆ మహారాజు! ఆ బిడ్డను చూచి సాక్షాత్తు ఇది మా నోముల పంటగా! భగవంతుడు వరప్రసాదంగా ఇచ్చిన బిడ్డ అని అక్కున చేర్చుకొని రాజ్యానికి చేరుకుని ఎంతో ఆనందంతో 'మహారాణికి ' అందిస్తాడు. వెంటనే పురోహితులను రప్పించి మణిమాలతో దొరకిన ఆ బాలునకు "మణికంఠుడని" నామకరణంచేసి అల్లారు ముద్దుగా పెంచుకోసాగినారు. అలా మన మణికంఠుని రాక (బిడ్డవచ్చిన వేళ మంచిది) అన్నట్లుగా! మహారాణికి పుత్రసౌభాగ్యం కలుగుతుంది. 

అనంతరం మహారాజు మణికంఠుని - సోదరుని గురుకులంలో చేర్పించి విద్యాబుద్దులు చెప్పిస్తారు. 'మణికంఠుడు' అచిరకాలంలోనే సర్వవిద్యా పారంగతుడౌతాడు. గురుదక్షిణగా, వికలాంగుడైన ఆ గురుపుత్రునికి కంటి చూపును మాటను ప్రసాదించి, తన మహిమను చాటుకుంటాడు. అలా గురు ఋణం తీర్చుకున్న ఆ బాలుని చూచి తోటి విద్యార్ధులు నిచ్చేష్టులై ఆ మణికంఠుని "గురువిన్ -గురువే" అని స్తుతించసాగేరు. అంటే గురువుకే గురువయ్యావు అని కీర్తించినారు. అలా విద్యాభ్యాసము పూర్తిచేసుకుని వచ్చిన బాలుడు అనంతరం అస్త్రవిద్యలలోను పారంగతుడౌతాడు. అట్టి బాలుని చూచుకున్న మహరాజుకు 'మణికంఠుని' యువరాజుగా పట్టాభిషేకం చెయ్యాలి అని సంకల్పించి పండితులను రప్పిస్తాడు. అది విన్న దుష్టబుద్ధి గల మంత్రి, మహారాణి బుద్ధిని వక్రీకరించి తనకు శిరోవేదన వచ్చిందని దానికి పులిపాలు తప్ప వేరే వైద్యము లేదని రాజవైద్యులచే చెప్పించి, మహారాణి స్వంతకొడుకును 'యువరాజు' చేసేందుకు కుట్రపన్నుతాడు మహామంత్రి. పాపం మహారాజు ఆ విషయం గమనించడు. తల్లిదండ్రుల ఋణం తీర్చుకొనుటకు ఇది చక్కని అవకాశముగా బావించి మణికంఠుడు మహారాజు అనుమతి తీసుకుంటాడు. 

పందళరాజు యెత్తిన 'ఇరుముడి' తలదాల్చి చేతిలో విల్లమ్ములను ధరించి అడవుల వెంట తిరుగుతూ అప్పుడే "ఈనియున్న" పులికై అన్వేషిస్తూ ఉన్న మణికంఠుని ఇంద్రుడు చూచి! ఆ బాలుని జన్మ రహస్యాన్ని, కర్తవ్యాన్ని బోధిస్తాడు. అది విన్న మణికంఠుడు తన అవతార ధర్మాన్ని తలచుకుని 'మహిషి' అన్వేషణ ప్రారంభిస్తాడు. మహిషి జాడ తెలుసుకొనుటకై కరిమల శిఖారాగ్రం చేరి పరాశక్తిని ప్రార్ధిస్తాడు. పరాశక్తి ప్రత్యక్షమయ్యి మణికంఠునికి మాయావి అయిన 'మహిషి' ని సంహరించాలి అంటే నల్లని వస్త్రాలు ధరించాలి అని, భూతసంహారానికి అవి మంచివని సూచించి, వానిచే ధరింపచేసి తనవెంట మహిషి సంహారం పూర్తి అయ్యేవరకు అండగా ఉంటానని అభయమిస్తుంది. అనంతరం 'అళుదానది' తీరంలో తారసపడిన మహిషితో ఘొరమైన యుద్ధము చేసి వధిస్తాడు. దానితో శాపవిముక్తి చెందిన "లీలావతి" జగన్మోహనా కారుడైన స్వామిని చూచి ఆతని సౌందర్యానికి ముగ్ధురాలై తనను వివాహమాడమని ప్రార్ధిస్తుంది. అందులకు స్వామి నిరాకరించి తాను ఆ జన్మ బ్రహ్మచారిగా ఉంటూ, సర్వమానవాళికి ఎల్లప్పుడు రక్షకుడై వుంటానని, ఆమెను "మాళికాపురత్తమ్మ"గా వెలుగొంది తన ప్రక్కనే వుండి జనుల పూజలందుకొమ్మని సెలవిస్తాడు. 

అనంతరం 'ఇంద్రుడు' తన స్వామికార్యం తీర్చవలసిన బాధ్యత తనకు ఉన్నది కావున! తాను 'పులి' గా మారి స్వామిని తనపై స్వారి చేస్తునందుకు ఇంద్రుడు లోలోన తన జన్మ సాఫల్యమైనందుకు మిక్కిలి సంతోషిస్తాడు. అలా పులిపాలు తెమ్మని పంపిన స్వామి! పులిపై స్వారీ చేస్తూ పులి పిల్లలతో కలసి 'పందళరాజ్యము' చేరుసరికి రాజదంపతులు, ప్రజలు నిశ్చేష్టులవుతారు. అలావస్తున్న మణికంఠునిలో సాక్షాత్తు దైవస్వరూపమ గాంచిన "మహారాణి" తన కుతంత్రాలను మన్నించమని కోరుతుంది. మహారాజు ఆస్వామిని ప్రేమతో కౌగలించుకుని ఇకపై రాజ్యభారం స్వీకరించవలసిందిగా కోరతాడు. అందులకు స్వామి నిరాకరిస్తాడు. 

దేవతల అనుమతితో మణికంఠుడు తన నిజరూప దర్శనమిచ్చి మహారాజు కోరిక తీర్చలేకపోతున్నందుకు మన్నించమని, తన తమ్మునికి రాజ్యపట్టాభిషేకం చేయమని తాను తపస్సుకై వెడలిపోతున్నానని తల్లిదండ్రుల వద్ద తాను అంతవరకు ధరించిన రాజాభరణములు, వారివద్దనే వదలివైచి సెలవు తీసుకుంటున్న స్వామిని చూచి నాయనా! నీ వాత్సల్యాన్ని మేము ఆజన్మాంతము మరువలేము. నీవుండే ప్రదేశాన్ని సెలవిమ్ము, అచ్చట గుడికట్టిస్తాను. తిరిగి మాకు నీ దర్శనభాగ్యం ఎలా? ఎప్పుడు లభిస్తుందో చెప్పమని వేడుకుంటారు. అందులకు స్వామి అచ్చటనుండే ఒక బాణాన్ని సంధించి దాని మార్గాన్ని వీక్షించేందుకు 'దివ్యదృష్టిని' ప్రసాదించి నా బాణం గుచ్చుకున్న ప్రదేశంలో నేను ఉంటాను. నా దర్శనం మీకు ప్రతి సంవత్సరం "మకర సంక్రాంతికి మకరజ్యోతి" రూపంలో మీకు, భక్తులకు లభ్యమవుతుంది. తల్లిదండ్రులైన మీరైన, భక్తులైనా సరే నన్ను దర్శించుటకు. 41 రోజుల పాటు కఠోరదీక్షలు బూనిన వారికే నా దర్శనభాగ్యం లభిస్తుందని సెలవుతీసుకుని, అదృశ్యమయి స్వామి తపోదీక్షకు వెడలిపోతారు. ఇదంతా పౌరాణికగాధ. 

అలా వెడలిన స్వామి మీకు ముందుగా చెప్పిన రీతిలో "చిన్ముద్రతో పట్టబంధాసనం"తో తపస్సులో ఆసీనులౌతారు. మహిషి సంహరానికి అయ్యప్ప స్వామి నల్లని వస్త్రాలు ధరిస్తారు. అట్టి భక్తులకు నేను ఎటువంటి బాధలు, హాని కలుగజేయనని శనీశ్వరుడు స్వామివారి ఆజ్ఞమేరకు అభయమిస్తాడు. అందువల్ల అయ్యప్ప దీక్షవహించువారికి శనిపీడ, బాధలు ఉండవని విశ్వసిస్తారు. 

ఇక దీక్షావిధానం గూర్చి కొద్దిగా ముచ్చటించుకుందాం! మనదేశంలో భక్తులు వివిధ రకాల దీక్షలు వహిస్తూ ఉంటారు. శ్రీ షిరిడిసాయి దీక్షలని, శివదీక్ష, శ్రీరామదీక్ష, హనుమదీక్ష, భవానిదీక్ష ఇలా ఎన్నో దీక్షలు ఆచరిస్తూ ఉంటారు. అలాగే శబరిమలై స్వామివారిది రాత్రి పొద్దుపండుగ, దీపావళి నుంచి సంక్రాంతి వరకు పగటి పొద్దుపండుగ. మకరసంక్రాంతి నాడు జ్యోతిదర్శనం వరకు ఒక విధంగా చెప్పాలంటే ఇది అయ్యప్పస్వాముల సీజనుగా చెప్పుకోవచ్చు. కొత్తగా దీక్షను ప్రారంభించే 'కన్నెస్వాములు' వారు దీక్ష తీసుకొనుటకు 18సం|| శబరిమలయాత్ర చేసిన శ్రేష్టమైన "గురుస్వాములను" ఎంపికచేసుకుని వారి ఆధ్వర్యంలో ఏదైనా ఆలయంలో "ముద్రమాల" ధరిస్తారు. అందు ఒకటి తులసిమాల విష్ణుప్రీతికి, రుద్రాక్షమాల శివుని ప్రీతికి రెండు రకాలమాలలు హరిహర పుత్రుడైన అయ్యప్పస్వామి దీక్షలో తప్పక ధరిస్తారు. నాటి నుండి దీక్షావస్త్రాలుగా నల్లని వస్త్రాలను ధరించి శరణు(ఘొ)ష ప్రియుడైన అయ్యప్పస్వామిని "స్వామియే శరణం అయ్యప్ప" అంటూ దీక్షావిధులను 'శబరిమలై' యాత్ర పూర్తి అయ్యేవరకు ఎంతో నిష్ఠగా ఆచరిస్తారు. మలై అంటే పర్వతం మలయాళభాషలో అయ్యప్ప వెలసిన శబరికొండను 'శబరిమలై' అంటారు. మహిషిని మట్టు పెట్టిన అనంతరం శాపవిముక్తి చెందిన 'లీలావతి' కోర్కెమేరకు స్వామి ఆకొండపై కొలువు తీరుతాడు. అయ్యప్పస్వామి దర్శనార్ధం వెళ్ళే భక్తులు కనీసం 'మండలకాలం' అంటే (41రోజులు) దీక్ష తీసుకోవటం తప్పనిసరి. మాలధారణ వహించిన భక్తుడు నాటి నుండి 'అయ్యప్పస్వామిగానే' వ్యవహరింపబడతాడు. దేహమే దేవాలయంగా "మానవుడ్ని మాధవుడుగా" మార్చే ఇంతకంటే గొప్ప ప్రక్రియ మరేముటుందో చెప్పండి!? 

ఈ దీక్షాకాలంలో చన్నీటిస్నానం లేదా నదీస్నానం తప్పనిసరిగా చెయ్యాలి. పాదరక్షలు లేకుండా నడవాలి. నేల లేక చాపమీద శయనించాలి. పడిపూజలు, భిక్షలు, కఠిన బ్రహ్మచర్యం వహించాలి. ఆధ్యాత్మిక చింతనే ధ్యేయంగా సుఖభోగాలను దరిచేరనీయకుండా సాధుభరితమైన జీవనం గడపాలి. పడి అంటే! పద్దెనిమిదిమెట్లు. స్వామికొండ యెక్కగానే స్వామిని దర్శించటానికి పద్దెనిమిదిమెట్లు వుంటాయి. అవి ' సోపానాధిదేవతల' పేరుమీద ప్రాచుర్యంలో ఉన్నాయి. చండిక, అన్నపూర్ణ, భద్రకాళి, భైరవి, సుబ్రహ్మణ్యేశ్వర, గంధర్వ, కార్తవీర్య, తృషనాభాయ, శృతిభేదక, కటుశబ్దక, యుడుంబు, భేతాళ, హరిప్రియ, కర్ణపిశాచి, పుళిందిని, రేణుక, ప్రదీపిక, ప్రత్యంగిరా అని వ్యవహరిస్తారు. వాటి పేర్లతో 18 మెట్లను పూలు - పళ్ళతో అలంకరించి కర్పూరాధి పాలతో స్వామికి పెట్టే మహాహరతే! 'పడి వెలిగించడం'. ఆ కాంతి ధారలో స్వాములే కాదు భక్తులంతా తడిసి తరిస్తారు. అదే 'పడిపూజ' ప్రక్రియా విశేషం. 

భిక్ష అంటే! భోజనం - ఉపాహారం - రొఖం దీనిని భక్తులు; బంధువులు మున్నగు పవిత్రమైన చోట్లనే ఈ భిక్షలు స్వీకరిస్తారు. ఇలా కఠోరమైన దీక్షలతో మండలదీక్షను పూర్తి అయిన చివరిగా "మకరసంక్రాంతికి - మకరజ్యోతి రూపంలో అయ్యప్పస్వామి" దర్శనానికి 'గురుస్వామి' ఆశీస్సులతో 'ఇరుముడి' ధరించి శబరిమలై యాత్రకు బయలుదేరుతారు స్వాములు సామూహికంగా. 

ఆ మకర సంక్రాంతి దినమందు "స్వామివారు లోగడ వారి తల్లిదండ్రులవద్ద వదలిన "తిరువాభరణాలు" వారి వంశీయులు పందళ రాజధాని నుండి ఊరేగింపుగా రధ, గజ, తురగాది సైన్యములతో మేళతాళాలతో తెచ్చి ఆ రోజు దీపాల వేళకే ఆ నగలను స్వామికి అలంకరిస్తారు. ఆనాటి నుండి ఈ నాటి వరకు అంతుపట్టని చిత్రమేమిటంటే ఆ పెట్టెలు స్వామి సన్నిధానానికి చేరే వరకు ఆకాశమున 'గరుడపక్షులు' ఎగురుతుంటాయి. శ్రీహరిని సేవించే గరుత్మంతుడే ఈ రూపంలో వచ్చినట్టు భ్రమ కలుగుతుంది భక్తులకు. ఆభరణాలు స్వామి సన్నిధికే చేరిన పిదప! ఆలయంచుట్టూ ప్రదక్షణలు చేసి అదృశ్యమవుతాయి. 

ఇక ఆభరణాలు అలంకరించి, దీపారాధన సమయంలో గర్భగుడి తలుపులు తెరువగానే శబరి కొండకు ఎదురుగా ఉన్న "కాంతిమలై" కొండపై సాక్షాత్తు స్వామి లోగడ తన తల్లిదండ్రలకు, భక్తులకు ఇచ్చిన మాటప్రకారం ఈనాటి వరకు శ్రీ జ్యోతిస్వరూపుడైన ఆ అయ్యప్పస్వామి "మకరసంక్రాంతికి - మకరజ్యోతి రూపంలో భక్తులందరకు దర్శనమిస్తూ! ఆశీస్సులు అందజేస్తాడు. ఒక్కక్షణం మెరిసే మెరుపు నక్షత్ర కాంతిలోని ఆ స్వామిని! దర్శించే వందలవేల సంఖ్యలోని భక్తులు తన్మయత్వంతో "స్వామియే శరణమయ్యప్ప" అనే ఘొష శ్రావ్యంగా నింగినంటేలా చెప్తారు. అది! కొందరు భక్తాగ్రేశ్వరులైన గురుస్వాములు అందించిన సమీక్ష గాధ. 

అఖిలాండ కోటి భక్త జనావళికి అడుగడుగునా ఆదుకునే "అయ్యప్ప స్వామి" వారు వారి అభయ హస్తముతో సర్వులకు వారి ఆశీస్సులు అందించాలని ప్రార్ధిస్తున్నాము.

కామెంట్‌లు లేవు: