ముక్కోటి ఏకాదశి

ధనుర్మాసంలో వచ్చే ఈ ఏకాదశి పవిత్రమైనది. విష్ణు ప్రీతికరమైన ఏకాదశులలో ఇది అత్యంత ప్రధానమైనది. 

అధరం మధురం వదనం మధురం నయనం మధురం హసితం మధురం| 

హృదయం మధురం గమనం మధురం మధురాధిపతే రఖిలం మధురం|| 

అట్టి సుమధుర మూర్తిని ఈ 'ఏకాదశి' రోజున వేయికనులతో వీక్షించి సేవించి తరంచి పోవాలని మూడు కోట్లమంది దేవతలు వైకుంఠమునకు చేరుకునే పుణ్యప్రదమైన రోజు కనుక ఇది వైకుంఠ ఏకాదశిగా "ముక్కోటి ఏకాదశి" గా భక్తులు పిలుస్తూ ఉంటారు. ఇట్టి పర్వదినం ప్రతిసంవత్సరం ధనుర్మాసములో పూర్ణిమకు ముందు వచ్చే ఏకాదశి అవుతుంది. 

ప్రముఖ దేవాలయాలలో (తిరుపతి, భద్రాచలం మున్నగు వైష్ణవ) పుణ్యక్షేత్రాలలో మామూలు రోజులలో అయితే, ఉత్తర ద్వారాలను మూసి ఉంచుతారు. ఈ "ముక్కోటి ఏకాదశి" రోజున మాత్రం వాటిని తెరచి ఉంచుతారు. ఆ రోజు భక్తులు సూర్యోదయానికి పూర్వమే నిద్రలేచి కాలకృత్యములు, స్నానసంధ్యాదులు ముగించుకొని అట్టి ప్రముఖ ఆలయాలలో ఉత్తర ద్వారం ద్వారా ప్రవేశించి ప్రదక్షిణలు ముగించుకుని దైవదర్శనం చేసుకుంటూ ఉంటారు. అలా ప్రదక్షిణ క్రమాన్నే "ముక్కోటి ప్రదక్షిణ" అని పిలుస్తూ ఉంటారు. 

ఈ వైకుంఠ ఏకాదశినే "పుత్రద" ఏకాదశి అని కూడా అంటారు. దీని విశిష్ఠతను తెలిపే ఒక కథ ఉన్నది. పూర్వం "సుకేతుడు" అను మహారాజు 'భద్రావతి' అను రాజ్యాన్ని ప్రజాభీష్టాలను తరచు గమనిస్తూ వాని పరిపాలన ఎల్లప్పుడు జ్ఞప్తికి ఉండేలా ప్రజలకు సర్వసౌఖ్యాలను కలిగిస్తూ ప్రజల మన్నలను పొందుతూ ఉండేవాడుట! అట్టి మహారాజు భార్య పేరు 'చంపక' ఆమె అంతటి మహరాణి అయినా, గృహస్ధు ధర్మాన్ని స్వయంగా చక్కగా నిర్వహిస్తూ అతిధి అభ్యాగతులను గౌరవిస్తూ, అటువంటి ఉత్తమమైన భర్త తనకు లభ్యమవటం పూర్వజన్మ పుణ్యఫలంగా భావిస్తూ, భర్తను పూజిస్తూ, ఇంకా ఎన్నో పుణ్యకార్యాలు వ్రతాలు చేస్తూ ఉండేది. తదనుగుణంగా మహారాజు కూడా ఆమెను ప్రోత్సహించేవాడు. అట్టి అన్యోన్య పుణ్యదంపతులకు మాత్రం, 'పుత్రసౌభాగ్యం' కరువై, అది వారి జీవితంలో తీరని లోటుగా మారింది. 

ఆ మహారాజు కూడా పుత్రకాంక్షతో ఎన్నో తీర్ధాలను సేవిస్తూ ఉండగా! ఒక పుణ్యతీర్ధం వద్ద కొందరు మహర్షులు తపస్సుల చేసుకుంటున్నారనే 'వార్త' తెలుసుకుంటాడు. ఆ దివ్యమూర్తులను సందర్శించి వారిని సేవించి తనకు పుత్ర భిక్ష పెట్టమని ప్రార్ధిస్తాడు. వారు మహారాజు వేదనను గ్రహించి రాజా! మేము 'విశ్వదేవులము' మీకు పుత్రసంతాన భాగ్యము తప్పకలుగుతుందని ఆ దివ్యతేజోమూర్తులు దీవిస్తూ, నేడు సరిగా 'పుత్రద ఏకాదశి' నీవు నీ భార్యతో ఈ ఏకాదశి వ్రతాన్ని ఆచరించిన యెడల మీ మనోభీష్టము తప్పక నెరవేరుతుంది అని చెప్తారు. అంత, ఆ వ్రత విధానాన్ని ఆ మహర్షుల ద్వారా ఉపదేశము పొంది, ఆ పుణ్యమూర్తులకు మరోమారు కృతజ్ఞతా పూర్వకముగా ప్రణమిల్లి శెలవు తీసుకుంటాడు. 

వెను వెంటనే అమితోత్సాహముతో నగరానికి చేరుకుని నదీ తీరాన జరిగిన వృతాంతమంతా 'చంపక' దేవితో చెప్తాడు. ఆమె కడు సంతోషించి ఆ దంపతులు యిరువురు భక్తి శ్రద్ధలతో శ్రీ లక్ష్మీనారాయణులను, పార్వతీ పరమేశ్వరులను పూజించి, ఉపవాస, జాగరణలతో, భగవన్నామసంకీర్తనలతో మహర్షులు ఉపదేశించిన విధంగా 'ఏకాదశీ వ్రతాన్ని' పూర్తిచేస్తారు. 

అనంతరం కొద్దికాలానికి హరి హరాదుల కృపాకటాక్షముతో కులవర్ధనుడైన కుమారుడు కలుగుతాడు. ఆ పిల్లవాడు శుక్ల పక్షచంద్రునిలా దినదిన ప్రవర్ధమాన మగుచూ, సత్‌శీలముతో విద్యాబుద్ధులు నేర్చుకుని యౌవ్వనము రాగానే, తల్లితండ్రుల అభీష్టముపై యువరాజై! ప్రజారంజకముగా పాలిస్తూ ఏకాదశ వ్రత విశిష్టతను రాజ్యమంతటా వివరిస్తూ! ప్రజల అందరిచేత ఈ వ్రతాన్ని చేయిస్తాడు. అది ఈ 'పుత్రద ఏకాదశి' లోని మహత్యం.

మకర సంక్రాంతికి - మకరజ్యోతి రూపంలో అయ్యప్పస్వామి

ప్రతి సంవత్సరం లక్షలాది మంది భక్తులను క్రమబద్దమైన రీతిలో నల్లని బట్టలు ధరింపజేసి, విలక్షణమైన రీతిలో కఠోరమైన దీక్షలు చేయించి, "స్వామియే శరణం అయ్యప్ప" అని శరణం చెప్పించుకుంటూ! భక్తులను కఠినశిలలపై బాధ తెలియని అఖిలాండ కోటి భక్తజనావళికి సదా ఆశీస్సులు అందించే ఆ అయ్యప్పస్వామి వారి జన్మ వృత్తాంతగాధ ఏమిటి? వారిని దర్శించుకోవటమెలా? అనే కుతూహలం మీకు ఉన్నదా?అసలు ఆ స్వామి చిన్ముద్రతో పట్టబంధాసనం లో తపస్సులో ఆసీనులైన తీరే! ముందు మనకు కలిగే మొదటి సందేహమవుతుంది. 

మానవుల భవబంధాలను త్రెంచి వారిని ముక్తి మార్గంలోకి మళ్ళించే సంకేతమే! ఈ చిన్ముద్రరూపంలోని భావం. ఇక మీరు ఎంతో ఆతృతగా ఎదురుచూస్తున్న స్వామివారి జన్మవృత్తంతగాధను పరిశీలిద్ధాం! దీనిపై కూడా విభిన్న రీతులలోగాధలు కానవస్తున్నాయి. భూత నాధోపాఖ్యానంలోనూ, బ్రహ్మండపురాణమందు అయ్యప్పస్వామివారి ప్రస్తావన ఉన్నట్లు భక్తులు చెప్తారు. బ్రహ్మ, విష్ణు, మహేశ్వర్లు భూలోకంలో ధర్మసంస్థాపన కావించాలి అని సంకల్పించి "దత్తాత్రేయుని" సృష్టిస్తారు. వానికి తోడుగా ఉండేందుకు ముగ్గురమ్మలు లక్ష్మీ, సరస్వతి, పార్వతీమాతలు వారి శక్తితో "యోగమాయను" "లీలావతిగా" సృష్టిస్తారు. అలా లీలావతి - దత్తస్వామి గృహస్ధాశ్రమాన్ని గడుపుచుండగా వారి అన్యోన్య దాంపత్యం మధ్య ఒక అపశృతి దొర్లుతుంది. 

అది దత్తస్వామికి తన కర్తవ్యమేమిటో జ్ఞానోదయమై సంసారంపట్ల విముఖతకల్గి వైరాగ్యాన్ని అవలంబించుట, దానితో మిక్కిలి ఆగ్రహించిన లీలావతి దత్తస్వామిని 'మహిషాసురుడనే' రాక్షసుడు కమ్మని శపిస్తుంది. అందులకు ప్రతిగా దత్తస్వామి లీలావతిని 'మహిషిగా' మారిపొమ్మని ప్రతిశాపమిస్తాడు. అలా వారు ఇరువురు వారి రాక్షస ప్రవర్తనతో! లోక కంటకులౌతారు. వారిలో మహిషాసురుని దుర్గాదేవి సంహరిస్తుంది. అందులకు మహిషి తన ప్రాణ సఖుని వధించినందులకు ప్రతీకారం తీర్చుకోవాలని బ్రహ్మను గూర్చి (ఘో)రమైన తపస్సుచేసి; తనకు హరి హరాదులకు కలిగిన బాలుడు తప్ప వేరెవరు తనను వధించకుండా వరమిమ్మని ప్రార్ధిస్తుంది. బ్రహ్మ 'తధాస్తు' అని అంతర్ధానమౌతాడు. 

పాపం ఇక్కడ మహిషి భావన! "హరి హరాదులు ఆలింగనం చేసుకున్నంత మాత్రాన బాలుడు కలుగడని, పోని కలిగినా! తన భయంకర రూపాన్ని చూచి బాలుడు తనను ఏమి చేయలేడని, భావించి ఉండవచ్చు నేమో! మరి. 

ఆ వర గర్వంతో, మహిషి దేవలోకాన్ని కొల్లగొట్టి దేవుళ్ళందరిని పలు ఇక్కట్లకు గురి చేస్తుంది. దానితో దేవేంద్రాది దేవతలు "శ్రీహరిని" ప్రార్ధిస్తారు. అప్పుడు శ్రీహరికి ఒక ఉపాయము తోచుతుంది. తాను లోగడ దేవ - దానవులు అమృతం కొరకు "క్షీరసాగరాన్ని" మధించినప్పుడు అందుండి లభ్యమైన అమృతాన్ని వారికి పంచే సమయాల్లో తాను ధరించిన "మోహిని అవతారాన్ని" పరమేశ్వరుడు మోహంతో చూచాడు. నేను తిరిగి ఆ అవతారము మరోమారు దాల్చితే పరమేశ్వరుడు తప్పకవచ్చి నన్ను ఆలింగనం చేసుకుంటాడు అని తలచి తిరిగి జగన్మోహినిగా అవతారముదాల్చి పరమేశ్వరుని దృష్టిపడు విధంగా! వనమందు సంచరించసాగాడు. తాను లోగడ చూచిన మోహిని తిరిగి కనిపించు సరికి శ్రీహరి ఆశించిన విధంగా! 'పరమేశ్వరుడూ వచ్చి ఆలింగనం చేసుకుంటాడు శ్రీమహావిష్ణువును. అలా వారి ఆలింగనలో ఇచ్చామాత్రంగానే అయొనిజుడైన బాలుడు కలుగుతాడు. ఆ బాలునకు సకల భూతాలపై ఆధిపత్యం వహించి భూతనాధుడు కమ్మని పరమేశ్వరుడు ఆశీర్వదించగా, శ్రీమహావిష్ణువు తన కౌస్తుభమణి సంకేతంగా ఒక మణిహారాన్ని ఆ బాలుని మెడలో వేస్తాడు. బ్రహ్మ ఆ బాలుని 'హరిహర పుత్రుడుగా ' ఆశీర్వదించి అంతర్ధానమవుతారు. 

ఇక్కడ ఒక విషయం గమనించండి, "జగద్తక్షకుడైన ఆ పరమేశ్వరునకు ఇంతటి మోహదృష్టి ఏమిటి? అని శంకించకండి, జగన్నాటక సూత్రధారులైన వారి లీలలు కేవలం లోకకళ్యాణార్ధమే తప్ప మనబోటి సామాన్యులకు అవి అర్ధంకావు. ముఖ్యంగా వారు ఇరువురు ఆశించేది మొదటిది 'మహిషి' మదమణచడంతో దేవతలకు మానవులకు ఆనందాన్ని ఇవ్వడం. రెండవది అభేదస్వరూపులమైన హరి హరాదుల మధ్య బేధభావంతో చూడకూడదు అని! భక్తులకు తెలియజేయుటయే వారి ఆత్మీయ ఆలింగనలోని భావంగా గ్రహించుకోవాలి. 

ఇలా ఉండగా! కేరళ దేశంలో 'పందళరాజ్యము' పాలించే భూపాలుడు రాజశేఖర పాండ్యునికి సంతానప్రాప్తి కరువైంది. అందులకై ఆతడు ఎన్నో యజ్ఞయాగాది క్రతువులు నిర్వహిస్తూ, ఒకసారి వేటకై తన పరివారాన్ని వెంటబెట్టుకుని పంపానదీతీరాన సర్పపడగ నీడన, కేరింతలు కొడుతూ చిరునవ్వులు చిందిస్తూ ఉన్న ఆ బాలుని, కేరింతలు విన్న ఆ మహారాజు! ఆ బిడ్డను చూచి సాక్షాత్తు ఇది మా నోముల పంటగా! భగవంతుడు వరప్రసాదంగా ఇచ్చిన బిడ్డ అని అక్కున చేర్చుకొని రాజ్యానికి చేరుకుని ఎంతో ఆనందంతో 'మహారాణికి ' అందిస్తాడు. వెంటనే పురోహితులను రప్పించి మణిమాలతో దొరకిన ఆ బాలునకు "మణికంఠుడని" నామకరణంచేసి అల్లారు ముద్దుగా పెంచుకోసాగినారు. అలా మన మణికంఠుని రాక (బిడ్డవచ్చిన వేళ మంచిది) అన్నట్లుగా! మహారాణికి పుత్రసౌభాగ్యం కలుగుతుంది. 

అనంతరం మహారాజు మణికంఠుని - సోదరుని గురుకులంలో చేర్పించి విద్యాబుద్దులు చెప్పిస్తారు. 'మణికంఠుడు' అచిరకాలంలోనే సర్వవిద్యా పారంగతుడౌతాడు. గురుదక్షిణగా, వికలాంగుడైన ఆ గురుపుత్రునికి కంటి చూపును మాటను ప్రసాదించి, తన మహిమను చాటుకుంటాడు. అలా గురు ఋణం తీర్చుకున్న ఆ బాలుని చూచి తోటి విద్యార్ధులు నిచ్చేష్టులై ఆ మణికంఠుని "గురువిన్ -గురువే" అని స్తుతించసాగేరు. అంటే గురువుకే గురువయ్యావు అని కీర్తించినారు. అలా విద్యాభ్యాసము పూర్తిచేసుకుని వచ్చిన బాలుడు అనంతరం అస్త్రవిద్యలలోను పారంగతుడౌతాడు. అట్టి బాలుని చూచుకున్న మహరాజుకు 'మణికంఠుని' యువరాజుగా పట్టాభిషేకం చెయ్యాలి అని సంకల్పించి పండితులను రప్పిస్తాడు. అది విన్న దుష్టబుద్ధి గల మంత్రి, మహారాణి బుద్ధిని వక్రీకరించి తనకు శిరోవేదన వచ్చిందని దానికి పులిపాలు తప్ప వేరే వైద్యము లేదని రాజవైద్యులచే చెప్పించి, మహారాణి స్వంతకొడుకును 'యువరాజు' చేసేందుకు కుట్రపన్నుతాడు మహామంత్రి. పాపం మహారాజు ఆ విషయం గమనించడు. తల్లిదండ్రుల ఋణం తీర్చుకొనుటకు ఇది చక్కని అవకాశముగా బావించి మణికంఠుడు మహారాజు అనుమతి తీసుకుంటాడు. 

పందళరాజు యెత్తిన 'ఇరుముడి' తలదాల్చి చేతిలో విల్లమ్ములను ధరించి అడవుల వెంట తిరుగుతూ అప్పుడే "ఈనియున్న" పులికై అన్వేషిస్తూ ఉన్న మణికంఠుని ఇంద్రుడు చూచి! ఆ బాలుని జన్మ రహస్యాన్ని, కర్తవ్యాన్ని బోధిస్తాడు. అది విన్న మణికంఠుడు తన అవతార ధర్మాన్ని తలచుకుని 'మహిషి' అన్వేషణ ప్రారంభిస్తాడు. మహిషి జాడ తెలుసుకొనుటకై కరిమల శిఖారాగ్రం చేరి పరాశక్తిని ప్రార్ధిస్తాడు. పరాశక్తి ప్రత్యక్షమయ్యి మణికంఠునికి మాయావి అయిన 'మహిషి' ని సంహరించాలి అంటే నల్లని వస్త్రాలు ధరించాలి అని, భూతసంహారానికి అవి మంచివని సూచించి, వానిచే ధరింపచేసి తనవెంట మహిషి సంహారం పూర్తి అయ్యేవరకు అండగా ఉంటానని అభయమిస్తుంది. అనంతరం 'అళుదానది' తీరంలో తారసపడిన మహిషితో ఘొరమైన యుద్ధము చేసి వధిస్తాడు. దానితో శాపవిముక్తి చెందిన "లీలావతి" జగన్మోహనా కారుడైన స్వామిని చూచి ఆతని సౌందర్యానికి ముగ్ధురాలై తనను వివాహమాడమని ప్రార్ధిస్తుంది. అందులకు స్వామి నిరాకరించి తాను ఆ జన్మ బ్రహ్మచారిగా ఉంటూ, సర్వమానవాళికి ఎల్లప్పుడు రక్షకుడై వుంటానని, ఆమెను "మాళికాపురత్తమ్మ"గా వెలుగొంది తన ప్రక్కనే వుండి జనుల పూజలందుకొమ్మని సెలవిస్తాడు. 

అనంతరం 'ఇంద్రుడు' తన స్వామికార్యం తీర్చవలసిన బాధ్యత తనకు ఉన్నది కావున! తాను 'పులి' గా మారి స్వామిని తనపై స్వారి చేస్తునందుకు ఇంద్రుడు లోలోన తన జన్మ సాఫల్యమైనందుకు మిక్కిలి సంతోషిస్తాడు. అలా పులిపాలు తెమ్మని పంపిన స్వామి! పులిపై స్వారీ చేస్తూ పులి పిల్లలతో కలసి 'పందళరాజ్యము' చేరుసరికి రాజదంపతులు, ప్రజలు నిశ్చేష్టులవుతారు. అలావస్తున్న మణికంఠునిలో సాక్షాత్తు దైవస్వరూపమ గాంచిన "మహారాణి" తన కుతంత్రాలను మన్నించమని కోరుతుంది. మహారాజు ఆస్వామిని ప్రేమతో కౌగలించుకుని ఇకపై రాజ్యభారం స్వీకరించవలసిందిగా కోరతాడు. అందులకు స్వామి నిరాకరిస్తాడు. 

దేవతల అనుమతితో మణికంఠుడు తన నిజరూప దర్శనమిచ్చి మహారాజు కోరిక తీర్చలేకపోతున్నందుకు మన్నించమని, తన తమ్మునికి రాజ్యపట్టాభిషేకం చేయమని తాను తపస్సుకై వెడలిపోతున్నానని తల్లిదండ్రుల వద్ద తాను అంతవరకు ధరించిన రాజాభరణములు, వారివద్దనే వదలివైచి సెలవు తీసుకుంటున్న స్వామిని చూచి నాయనా! నీ వాత్సల్యాన్ని మేము ఆజన్మాంతము మరువలేము. నీవుండే ప్రదేశాన్ని సెలవిమ్ము, అచ్చట గుడికట్టిస్తాను. తిరిగి మాకు నీ దర్శనభాగ్యం ఎలా? ఎప్పుడు లభిస్తుందో చెప్పమని వేడుకుంటారు. అందులకు స్వామి అచ్చటనుండే ఒక బాణాన్ని సంధించి దాని మార్గాన్ని వీక్షించేందుకు 'దివ్యదృష్టిని' ప్రసాదించి నా బాణం గుచ్చుకున్న ప్రదేశంలో నేను ఉంటాను. నా దర్శనం మీకు ప్రతి సంవత్సరం "మకర సంక్రాంతికి మకరజ్యోతి" రూపంలో మీకు, భక్తులకు లభ్యమవుతుంది. తల్లిదండ్రులైన మీరైన, భక్తులైనా సరే నన్ను దర్శించుటకు. 41 రోజుల పాటు కఠోరదీక్షలు బూనిన వారికే నా దర్శనభాగ్యం లభిస్తుందని సెలవుతీసుకుని, అదృశ్యమయి స్వామి తపోదీక్షకు వెడలిపోతారు. ఇదంతా పౌరాణికగాధ. 

అలా వెడలిన స్వామి మీకు ముందుగా చెప్పిన రీతిలో "చిన్ముద్రతో పట్టబంధాసనం"తో తపస్సులో ఆసీనులౌతారు. మహిషి సంహరానికి అయ్యప్ప స్వామి నల్లని వస్త్రాలు ధరిస్తారు. అట్టి భక్తులకు నేను ఎటువంటి బాధలు, హాని కలుగజేయనని శనీశ్వరుడు స్వామివారి ఆజ్ఞమేరకు అభయమిస్తాడు. అందువల్ల అయ్యప్ప దీక్షవహించువారికి శనిపీడ, బాధలు ఉండవని విశ్వసిస్తారు. 

ఇక దీక్షావిధానం గూర్చి కొద్దిగా ముచ్చటించుకుందాం! మనదేశంలో భక్తులు వివిధ రకాల దీక్షలు వహిస్తూ ఉంటారు. శ్రీ షిరిడిసాయి దీక్షలని, శివదీక్ష, శ్రీరామదీక్ష, హనుమదీక్ష, భవానిదీక్ష ఇలా ఎన్నో దీక్షలు ఆచరిస్తూ ఉంటారు. అలాగే శబరిమలై స్వామివారిది రాత్రి పొద్దుపండుగ, దీపావళి నుంచి సంక్రాంతి వరకు పగటి పొద్దుపండుగ. మకరసంక్రాంతి నాడు జ్యోతిదర్శనం వరకు ఒక విధంగా చెప్పాలంటే ఇది అయ్యప్పస్వాముల సీజనుగా చెప్పుకోవచ్చు. కొత్తగా దీక్షను ప్రారంభించే 'కన్నెస్వాములు' వారు దీక్ష తీసుకొనుటకు 18సం|| శబరిమలయాత్ర చేసిన శ్రేష్టమైన "గురుస్వాములను" ఎంపికచేసుకుని వారి ఆధ్వర్యంలో ఏదైనా ఆలయంలో "ముద్రమాల" ధరిస్తారు. అందు ఒకటి తులసిమాల విష్ణుప్రీతికి, రుద్రాక్షమాల శివుని ప్రీతికి రెండు రకాలమాలలు హరిహర పుత్రుడైన అయ్యప్పస్వామి దీక్షలో తప్పక ధరిస్తారు. నాటి నుండి దీక్షావస్త్రాలుగా నల్లని వస్త్రాలను ధరించి శరణు(ఘొ)ష ప్రియుడైన అయ్యప్పస్వామిని "స్వామియే శరణం అయ్యప్ప" అంటూ దీక్షావిధులను 'శబరిమలై' యాత్ర పూర్తి అయ్యేవరకు ఎంతో నిష్ఠగా ఆచరిస్తారు. మలై అంటే పర్వతం మలయాళభాషలో అయ్యప్ప వెలసిన శబరికొండను 'శబరిమలై' అంటారు. మహిషిని మట్టు పెట్టిన అనంతరం శాపవిముక్తి చెందిన 'లీలావతి' కోర్కెమేరకు స్వామి ఆకొండపై కొలువు తీరుతాడు. అయ్యప్పస్వామి దర్శనార్ధం వెళ్ళే భక్తులు కనీసం 'మండలకాలం' అంటే (41రోజులు) దీక్ష తీసుకోవటం తప్పనిసరి. మాలధారణ వహించిన భక్తుడు నాటి నుండి 'అయ్యప్పస్వామిగానే' వ్యవహరింపబడతాడు. దేహమే దేవాలయంగా "మానవుడ్ని మాధవుడుగా" మార్చే ఇంతకంటే గొప్ప ప్రక్రియ మరేముటుందో చెప్పండి!? 

ఈ దీక్షాకాలంలో చన్నీటిస్నానం లేదా నదీస్నానం తప్పనిసరిగా చెయ్యాలి. పాదరక్షలు లేకుండా నడవాలి. నేల లేక చాపమీద శయనించాలి. పడిపూజలు, భిక్షలు, కఠిన బ్రహ్మచర్యం వహించాలి. ఆధ్యాత్మిక చింతనే ధ్యేయంగా సుఖభోగాలను దరిచేరనీయకుండా సాధుభరితమైన జీవనం గడపాలి. పడి అంటే! పద్దెనిమిదిమెట్లు. స్వామికొండ యెక్కగానే స్వామిని దర్శించటానికి పద్దెనిమిదిమెట్లు వుంటాయి. అవి ' సోపానాధిదేవతల' పేరుమీద ప్రాచుర్యంలో ఉన్నాయి. చండిక, అన్నపూర్ణ, భద్రకాళి, భైరవి, సుబ్రహ్మణ్యేశ్వర, గంధర్వ, కార్తవీర్య, తృషనాభాయ, శృతిభేదక, కటుశబ్దక, యుడుంబు, భేతాళ, హరిప్రియ, కర్ణపిశాచి, పుళిందిని, రేణుక, ప్రదీపిక, ప్రత్యంగిరా అని వ్యవహరిస్తారు. వాటి పేర్లతో 18 మెట్లను పూలు - పళ్ళతో అలంకరించి కర్పూరాధి పాలతో స్వామికి పెట్టే మహాహరతే! 'పడి వెలిగించడం'. ఆ కాంతి ధారలో స్వాములే కాదు భక్తులంతా తడిసి తరిస్తారు. అదే 'పడిపూజ' ప్రక్రియా విశేషం. 

భిక్ష అంటే! భోజనం - ఉపాహారం - రొఖం దీనిని భక్తులు; బంధువులు మున్నగు పవిత్రమైన చోట్లనే ఈ భిక్షలు స్వీకరిస్తారు. ఇలా కఠోరమైన దీక్షలతో మండలదీక్షను పూర్తి అయిన చివరిగా "మకరసంక్రాంతికి - మకరజ్యోతి రూపంలో అయ్యప్పస్వామి" దర్శనానికి 'గురుస్వామి' ఆశీస్సులతో 'ఇరుముడి' ధరించి శబరిమలై యాత్రకు బయలుదేరుతారు స్వాములు సామూహికంగా. 

ఆ మకర సంక్రాంతి దినమందు "స్వామివారు లోగడ వారి తల్లిదండ్రులవద్ద వదలిన "తిరువాభరణాలు" వారి వంశీయులు పందళ రాజధాని నుండి ఊరేగింపుగా రధ, గజ, తురగాది సైన్యములతో మేళతాళాలతో తెచ్చి ఆ రోజు దీపాల వేళకే ఆ నగలను స్వామికి అలంకరిస్తారు. ఆనాటి నుండి ఈ నాటి వరకు అంతుపట్టని చిత్రమేమిటంటే ఆ పెట్టెలు స్వామి సన్నిధానానికి చేరే వరకు ఆకాశమున 'గరుడపక్షులు' ఎగురుతుంటాయి. శ్రీహరిని సేవించే గరుత్మంతుడే ఈ రూపంలో వచ్చినట్టు భ్రమ కలుగుతుంది భక్తులకు. ఆభరణాలు స్వామి సన్నిధికే చేరిన పిదప! ఆలయంచుట్టూ ప్రదక్షణలు చేసి అదృశ్యమవుతాయి. 

ఇక ఆభరణాలు అలంకరించి, దీపారాధన సమయంలో గర్భగుడి తలుపులు తెరువగానే శబరి కొండకు ఎదురుగా ఉన్న "కాంతిమలై" కొండపై సాక్షాత్తు స్వామి లోగడ తన తల్లిదండ్రలకు, భక్తులకు ఇచ్చిన మాటప్రకారం ఈనాటి వరకు శ్రీ జ్యోతిస్వరూపుడైన ఆ అయ్యప్పస్వామి "మకరసంక్రాంతికి - మకరజ్యోతి రూపంలో భక్తులందరకు దర్శనమిస్తూ! ఆశీస్సులు అందజేస్తాడు. ఒక్కక్షణం మెరిసే మెరుపు నక్షత్ర కాంతిలోని ఆ స్వామిని! దర్శించే వందలవేల సంఖ్యలోని భక్తులు తన్మయత్వంతో "స్వామియే శరణమయ్యప్ప" అనే ఘొష శ్రావ్యంగా నింగినంటేలా చెప్తారు. అది! కొందరు భక్తాగ్రేశ్వరులైన గురుస్వాములు అందించిన సమీక్ష గాధ. 

అఖిలాండ కోటి భక్త జనావళికి అడుగడుగునా ఆదుకునే "అయ్యప్ప స్వామి" వారు వారి అభయ హస్తముతో సర్వులకు వారి ఆశీస్సులు అందించాలని ప్రార్ధిస్తున్నాము.

భోగి, సంక్రాంతి, కనుమ


సంక్రాంతి అభ్యుధయ కాముకులను కూడా సంప్రదాయం వైపు మళ్ళిస్తుంది. పండుగలు, పర్వాలు వచ్చినప్పుడల్లా అభ్యుదయ కవులు సైతం సంప్రదాయం వైపు మొగ్గుచూపుతారు. అసలు అదే ఈ పండుగల లక్ష్యంగా కనబడుతుంది. సంక్రాంతికి ముందే నెల పెట్టడం అని ముగ్గులు పెట్టడం, గొబ్బెమ్మలతో అలంకరించడం నెలరోజులపాటు సాగుతుంది. చివరి రోజున రధం ముగ్గును వేస్తారు. జానపదుల కళలు ఈ సంక్రాంతి పండుగ ఈ సంక్రాంతి పండుగ సందర్భంగా బహిర్గతమవడమే కాకుండా ప్రదర్శింపబడతాయి. వీటిలో చెప్పుకోతగ్గది "గంగిరెద్దుల" ఆట. కొన్ని గ్రామాలలో ఐతే 'కోడి పందాల ఆట' కూడా ఆడుతారు. 

ఇంకా సంక్రాంతి ప్రత్యేకత శాస్త్రపరంగా చాలా ఉంది. నక్షత్రాల ఇరువది ఏడు. మళ్ళీ ఒక్కొక్క నక్షత్రానికి నాలుగు పాదాలు. మొత్తం 108 పాదాలుగా విభజింపబడినాయి. తిరిగి 108 పాదాల్నీ 12 రాశులుగా విభాగించారు. సూర్యుడు నెలకొకరాశిలో ప్రవేశిస్తాడు. సూర్యుడు ఏ రాశిలో ప్రవేశిస్తే ఆ రాశి ఆ సంక్రాంతిగా వ్యవహరింపబడుతుంది. సూర్యుడు మకరరాశిలో ప్రవేశించినప్పుడు ఆ రాశిని 'మకర సంక్రాంతి' అని అంటారు. 

హిందువులు అంతా పెద్దల నుండి పిన్నల వరకు అత్యంత ప్రీతిపాత్రంగా ఆచరించే పండుగలలో "సంక్రాంతి" ప్రముఖస్ధానం సంపాదించుకుంది. ఇది పుష్యమాసంలో సూర్యుడు "మకరరాశిలో" ప్రవేశించిన పుణ్యదినం.   ఈ సంక్రాంతిలో "సం" అంటే మిక్కిలి "క్రాంతి" అంటే అభ్యుదయం. మంచి అభ్యుదయాన్ని ఇచ్చు క్రాంతి కనుక దీనిని "సంక్రాంతి" గా పెద్దలు వివరణ చెబుతూ "మకరం" అంటే! మొసలి. ఇది పట్టుకుంటే వదలదు అని మనకు తెలుసు. కాని మానవుని యొక్క ఆధ్యాత్మిక మార్గానికి అడుగడుగునా అడ్డుతగులుతూ, మొక్షమార్గానికి అనర్హుని చేయుటలో ఇది అందవేసినచేయి! అందువల్ల ఈ "మకర సంక్రమణం" పుణ్యదినాలలో దీని బారినుండి తప్పించుకునేందుకు ఒకటేమార్గం అది ఎవరికి వారు యధాశక్తి 'లేదు' అనకుండా దానధర్మాలు చేయుటయే మంచిదని, శాస్త్రకోవిదులు చెబుతూ ఉంటారు. అలా! కేవలం అప్పుడే కాకుండా! నిత్య జీవనంలో కూడా దాని బారిని పడకుండా చూచుకుంటూ ఉండాలికదా! మరి. ఇక ఈ పండుగల లోని విశిష్టత ఏమిటో తెలుసుకుందాం. 

తెలుగువారికి అత్యంత ప్రియమైన పండుగలు, వరుసగా మూడు రోజులు వచ్చే పండుగలు ఇవే! ముఖ్యంగా 'సంక్రాంతి' అని పిలుచుకుంటాం. దీనిని పెద్ద పండుగ అని కూడా అంటారు. పుష్యమాసంలో వచ్చే ఈ పండుగకు ఇంటికి ధనధాన్య రాశులు చేరతాయి. పౌష్యలక్ష్మితో కళకళలాడే గృహ ప్రాంగణాలతో, ఇల్లిల్లూ ఒకకొత్త శోభతో వెలుగుతూ ఉంటుంది. ఇంకా ఈ పండుగ వస్తుందంటే పిండి వంటలతో ముఖ్యంగా అరిసెలుచక్రాలలతో అందరి ఇళ్ళు ఘుమ ఘుమ లాడుతూ ఉంటాయి. 

మొదటి రోజు 'భోగి'. మూల మూలల చెత్తా, పనికిరాని కర్ర దుంగలూ ఓచోట చేర్చి, భోగి మంటలు వేసి, ఎముకలు కొరికే చలిని తరిమి కొడతారు. ఇళ్ళలో బొమ్మల కొలువులు, చిన్న పిల్లలకి భోగి పళ్ళు దిష్టి తీయడం వంటి ఆచారాలు సంబరాన్ని తెస్తాయి. పంట చేతికొచ్చిన ఆనందలో ఇళ్ళకు అల్లుళ్ళని, కూతుళ్ళని ఆహ్వానిస్తారు. 

రెండో రోజు 'సంక్రాంతి'. సూర్యుడు మకరరాశిలో ప్రవేశించే శుభదినం. ఈ పండుగకు కొత్తశోభ తీసుకురావడానికి, వారం, పది రోజుల ముందే ఇళ్ళకు సున్నాలు, రంగులు వేయడం ఆనవాయితీ. చనిపోయిన పెద్దలను తలచుకుని మొక్కుతారు. పిండివంటలు చేస్తారు. నలుగురికీ పంచిపెట్టి, తాము తిని సంబరంగా గడుపుతారు. 

మూడో రోజు 'కనుమ'. దీన్నే పశువుల పండుగ అని అంటారు. తమ చేతికొచ్చిన పంటను తామేకాక, పశువులూ, పక్షులూ పాలుపంచుకోవాలని పిట్టల కోసం ధాన్యపు కంకులు ఇంటి గుమ్మాలకు కడతారు. పల్లెల్లో పశువులే గొప్పసంపద. అవి ఆనందంగా ఉంటే రైతుకి ఉత్సాహం. పంటల్లో వీటి పాత్ర ఎంతో ఉంది. వాటిని ప్రేమగా చూసుకొనే రోజుగా కనుమను భావిస్తారు. గొబ్బెమ్మల పూజ, గంగిరెద్దుల హడావుడి, హరిదాసుల రాకడ, కోడిపందాలు, ఎడ్లపందాలు, బంతిపూల తోరణాలు, కొత్త జంటల విహారాలు, ఎంతో ఆహ్లదకరంగా కనిపిస్తాయి. 

ఇంతటి విశిష్టమైన పండుగ వింతశోభలు తిలకించాలి అంటే గ్రామసీమలే పట్టుగొమ్మలు. ప్రతి ఇల్లు నూతనంగా ముత్యాల ముగ్గులతో పచ్చని తోరణాలతో, కళకళలాడుతూ! "సంక్రాంతి" లక్ష్మీని ఆహ్వానిస్తూ ఉంటాయి. ఇక ధనుర్మాసము ప్రారంభమైన నాటినుండి వివిధ ఆలయాలలోని అర్చకస్వాములు "సంక్రాంతి" నెలపట్టి సూర్యోదయానికి పూర్వమే మంగళవాయిద్యాలతో నదీజలాలను "తీర్ధంబిందులలో" తోడ్కొని వచ్చి విశేషార్చనలు నిర్వహిస్తారు. ఇంటిముందు కన్నెపిల్లలు కళ్ళాపులు చల్లుతూ! ప్రతిరొజు వివిధ రకాల ముగ్గులతో! సప్తవర్ణాల రంగవల్లికలను తీర్చిదిద్ది "ఇంద్రధనుస్సులను" ముంగిట చూస్తున్నట్లు భ్రమింపచేస్తారు. 

ఇంత చక్కని ఆనందాన్నీ మనకు అందించే "సంక్రాంతి" పండుగలు మనం జరుపుకుని మహారాణిలావచ్చే ఆ సంక్రాంతి లక్ష్మీని మన ముంగిటలోనికి ఆహ్వానం పలుకుదాం. 

ఈ పండుగకు ప్రత్యేకంగా చేసుకుంటారు.

శ్రీ దత్తాత్రేయ స్వామి జయంతి


దత్తాత్రేయ శివం శాంత మింద్రనీల నిభం ప్రభుమ్ |

ఆత్మ మాయారతం దేవమవధూతం దిగంబరమ్ ||

భస్మోద్ధూళిత సర్వాంగం జటాజూటం ధరం విభుమ్ |

చతుర్భాహు ముదారాంగం దత్తాత్రేయం నమామ్యహమ్ ||

ఒకసారి లోకకళ్యాణార్థం నారదుడు ఆడిన చతురోక్తికిలోనైన లక్ష్మీ, సర్వస్వతి, పార్వతిమాతలు, మహాపతివ్రత అయిన అనసూయపై ఈర్ష్య అసూయ ద్వేషాలను పెంచుతున్నారు. ఈ ఈర్ష్య అసూయ ద్వేషమనే దుర్గుణలకు లోనయితే! దేవతలకైనా అనేక దుఃఖాలు కలుగుతాయని స్వరులకు తెలియచెప్పుటకో: లేక శ్రీదత్తుని అవతారానికి నాంది పలుకుటకో! మరి నారదుని ఆంతర్యమేమిటో?

ఏది అయితేనేమి! ఈ గుణాలూ వారి మనస్సునిండా దావానలంలా వ్యాపించి ముగ్గురమ్మల గుండెలు భగ్గుమన్నాయి. వారి వారి పత్నులను తక్షణం ఆ అనసూయ ఆశ్రమానికి వెళ్ళి ఆమె పాతివ్రత్యాన్ని భగ్నం చేయమని ప్రార్థించారు. త్రిమూర్తూలు ఎంతవారించినా, పెడచెవిని పెట్టారు ససేమిరా! అన్నారు. దానికి తోడు ఆ ముగ్గురమ్మలకు ఇంద్రాది దేవతల భార్యలు కూడా వంతపాడారు. ఇక చేయునది లేక సన్యాస వేషములు ధరించి అత్రి ఆనసూయ ఆశ్రమ ప్రాంతమందు భూమిపై పాదంమోపారు. వారి పాదస్పర్శకు భూదేవి పులకించింది, వృక్షాలు వారికి వింజామరలు వీస్తున్నట్లుగా తలలాడిస్తూ వారి పాదలచెంత పుష్పాలు పండ్లు నేలకురాల్చాయి. నెమలి పురివిప్పి నాట్యం చేయసాగింది. లేడిపిల్లలు చెంగు చెంగున గంతులువేస్తూ వారి వద్దకు వస్తున్నాయి. కుందేటి పిల్లలు వారి పాదాలు స్పృశించి పునీతమవ్వాలని ఏమిటో? అడుగడుగునా పాదాలకు అడ్డుపడుతున్నాయి. వన్య ప్రాణులకేరింతలతో అ ఆశ్రమ వాతవరణం అంతా ఆహ్లాదమవుతోంది. ఈ ఆకస్మిక పరిణామ మేమిటో? అని వారిని చూచిన పక్షులు కిలకిలా రావలు చేయసాగాయి. ఇవికాక ఒక ప్రక్క పవిత్ర జలపాతాల సోయగాలు, మరోప్రక్క ఆశ్రమ బాలకుల వేదమంత్రోచ్చారణ కర్నామృతంగా వినిపిస్తున్నాయి. ఇంత చక్కని ప్రకృతి అందాలకు ఆలవాలమైన ఈ రమనీయ వాతావరణమందు తేలియాడుతున్న ఈ భూలోకవాసులు ఎంతటి అదృష్టవంతులో మరి! మనం నుగ్గురం కూడ చిన్నారి బాలురవలె ఈ ముని బాలకులతో లలిసి ఆడుకుంతే! ఎంతబాగుండునో! అని తన్మయత్వంతో ఆ త్రిమూర్తులు పలుకుతారు. అలా మైమరపిస్తున్న ఆ ఆశ్రమ వాతావరణం నుంచి ఒక్కసారి తెప్పరిల్లి ఇంతకీ మానం వచ్చిన మాటాను మరచి మన భార్యలకు ఇచ్చిన మాటను విస్మరించాం; అని తలచి ఆశ్రమం ముంగిటవైపునకు పయనమయినారు.

మహాతపోబలసంపున్నుడైన కర్దమ మహర్షికి, దేవహూతికి జన్మించిన అనసూయాదేవిని, ముని శ్రేష్ఠౌడైన అత్రిమహర్షికి ఇచ్చి వివాహంచేసారు. అప్పటి నుండి ఆమె గృహస్థురాలిగా గృహస్థధర్మాన్ని చక్కగా నిర్వహిస్తూ అత్రిమహర్షికి సేవలు చేస్తూ, అతిధి అభ్యాగతులను అదరిస్తూ తన "పతి సేవతత్ పరతచే" పొందిన పాతివ్రత్య మహిమలతో ముల్లోకాలను అబ్బురపరస్తూ; పంచభూతాలు, అష్టదిక్పాలకులు సహితం అణకువుగా వుండేలా చేస్తున్న ఆ పతివ్రతామతల్లిని, దివ్యతపోతేజోమూర్తి అయిన అత్రిమహర్షిని చూచినంతనే త్రిమూర్తులు ముగ్ధులయ్యారు. ఆ సాధుపుంగవుల మువ్వురను చూచిన ఆ పుణ్య దంపతులు, సాదరంగా ఆశ్రమంలోనికి అహ్వానించి ఉచిత ఆసనాలు ఇచ్చి స్వాగత సత్కారాలు చేసి, అనంతరం మీరు మువ్వురు బ్రహ్మ, విష్ణు, మహేస్వరులవలె వచ్చినట్లుగా వచ్చి మా ఆశ్రమాన్ని పావనం చేశారు, భోజనాలు సిద్ధంచేశాను రండి అంటూ! అనసూయమ్మ ఆహ్వానం పలికింది. అత్రిమహర్షితో కలిసి ముగ్గురు సాధువులు ఆసీనులయ్యారు. ఇక వడ్డన ప్రారంభించుటకు సమాయత్తమవుతున్న అనసూయతో.... చెవుల వెంట వినరాని అభ్యంతరకరమైన నియమాన్ని వారు ప్రకటించి వడ్డించమని కోరతారు. వరి పలుకులు అ పతివ్రతామతల్లికి శిరస్సున పిడుగు పడినట్లు అయింది.

ఒక్కసారి తన ప్రత్యక్షదైవమైన "భర్త"ను మనసారా నమస్కరించుకుంది. "పాతివ్రత్యజ్యోతి" వెలిగింది. ఆమె జ్!నాననేత్రం తెరుచుకుంది. కపట సన్యాసరూపంలో ఉన్నత్రిమూర్తుల గుట్టు రట్టు ఐంది. వారి అంతర్యమేమిటో గ్రహించింది. పెదవుల వెంటా చిరునవ్వు చెక్కు చెదరకుండా! ఏమినా భాగ్యము! ముల్లోకాలను ఏలే సృష్టి, స్థితి, లయకారకులైన వీరు నాముంగిట ముందుకు యాచకులవలె వచ్చినారా? వీరిని కనుక నేను తృప్తిపరిస్తే ముల్లోకాలు కూడా ఆనందింపచేసిన భాగ్యం నాకు కలుగుతుంది కదా; అని ఆలోచిస్తూ! ఒక ప్రక్క పాతివ్రత్యం! మరోవైపు అతిథిసేవ! ఈ రెండు ధర్మాలను ఏకకాలంల్లో సాధించడమెలా? అనుకుంటూ పతికి నమస్కరించి "ఓం శ్రీపతి దేవయనమః" అంటూ కమండలోదకమున ఆ త్రిమూర్తుల శిరస్సున చల్లింది. వెంటనే అ ముగ్గురు పసిబాలురయ్యారు! వెనువెంటనే అనసూయలో మాత్ర్త్వం పొంగిస్తన్యం పొంగింది. కొంగుచాతున ఆ ముగ్గురు బాలురకు పాలు ఇచ్చి వారి ఆకలి తీర్చింది. ఇంతలో ఋషి కన్యలు, ౠషిబాలురు కలిసి మెత్తన్ పూల పాంపుతో ఊయలవేయగా! వారిని జోలపాడుతూ నిదురపుచ్చింది. "ఇ "ఇంతటి మహద్భాగ్యం" సృష్టిలో ఏ తల్లికి దక్కుతుందో చెప్పండి....! ఆ వింత దృశ్యాన్ని చూచిన అత్రి మహర్షి ఒకసారి త్ట్రుపడి మరలాతేరుకుని, తన దివ్య దృష్టితో జరిగినది, జరగబోతున్నది గ్రహించుకున్నాడు. ఈ త్రిమూర్తులు "ఈ ఆశ్రమ ప్రవేశ సమయమందే" ఆశ్రమ వాతావరణానికి తన్మయత్వంతో పలికిన పలుకులే! కార్యరూపందాల్చడం బ్రహ్మవాక్కుగా తలచి! ఆ చిన్నారులు బుడి బుడి నడకలతో, ఆడుతూ గెంతుతూ అ ముని బాలకులతో, కలిసి వారి కలలను పండించుకోసాగారు. మానవులకు బాల్య, కౌమార, యవ్వన, వార్ధక్యాలలో ఆనందముగా సాగేది ఈ బాల్యదశే కదా మధురాను భూతిని మిగిల్చిది అని మురిసిపోయారు. కనని తల్లి దండ్రులైన అత్రి అనసూయల పుత్ర వాత్సల్య బాంధవ్య అయౌనిజులైన వారికి చాలాకాలం కొనసాగుతుంది.

ఇలా ఉండగా! లక్ష్మీ, సరస్వతి, పార్వతి మాతలకు భర్తల ఆచూకీ తెలియక గుబులు పుట్టింది. అంతలో దేవర్షి నారదునివల్ల అత్రిమహర్షి ఆశ్రమమందు జరిగిన వింత తెల్లుసుకున్నారు. దానితో అనసూయపై ఏర్పడిన "ఈర్ష అసూయ - ద్వేషాలు" పటాపంచలు అయ్యాయి. వెంటనే వారి స్వస్వరూపాలతోనే అనసూయ అత్రిముని ఆశ్రమానికి చేరుకున్నారు. వారిని ముని కన్యలు స్వాగతించారు. అ సమయాన అనసూయమ్మ తల్లి ఆ చిన్నారులకు పాలు ఇచ్చి, ఊయలలో పరుండబెట్టి జోలపాడుతూ ఉంది! అంతలో ఆ ముగ్గురమ్మలను చూచి సాదరంగా ఆహ్వానించి, స్వాగత సత్కారములతో సుఖాసీనులను చేసింది.

పసిబాలుర రూపాల్లో ఉన్న వారి వారి భర్తలను చూచుకొని పతిబిక్ష పెట్టమని కన్నీళ్ళతో అత్రి అనసూయ పాదాలను ఆశ్రయిస్తారు. అయితే! మీ మీ భర్తలను గుర్తించి! తీసుకోని వెళ్ళండి అని అనసూయ హుందాగా చెబుతుంది. ఒకే వయస్సుతో, ఒకేరూపుతో, అమాయకంగా నోట్లో వేలువేసుకోని, నిద్రిస్తున్న అ జగన్నాటక సూత్రధారులను ఎవరు? ఎవరో? గుర్తించుకోలేక పోయారు. తల్లీ! నీ పాతివ్రత్య దీక్షను భగ్నం చేయ్యాలని "ఈర్ష్య, అసూయ, ద్వేషాలతో!" మేము చేసిన తప్పిదాన్ని మన్నించి మా భర్తలకు దయతో స్వస్వరూపాలు ప్రసాదించమని ప్రాధేపడతారు. అంత ఆ అనసూయమాత తిరిగి పతిని తలచుకుని కమండలోదకము తీయు సమయాన! త్రిమూర్తులు సాక్షాత్కరించి, ఈ ఆశ్రమవాస సమయమందు, మీరు కన్న తల్లి దండ్రులకంటే మిన్నగా పుత్రవాత్సల్యాన్ని మాకు పంచిపెట్టరు. మీకు ఏమి వరంకావాలో కోరుకోమన్నారు. నాయనలారా! ఈ పుత్ర వాత్సల్యభాగ్యాన్ని మాకు! మీరు మీరుగా ఇచ్చినారు. అది మాకు శాశ్వతంగా ఉండేలా అనుగ్రహించండి అని వరం కోరుకున్నారు. పుణ్య దంపతుల్లారా! మీ పుత్ర వాత్సల్యానికి, మీకు మేము మువ్వురము దత్తమవుతున్నాము. మీకీర్తి ఆ చంద్రతారార్కం కాగలదని వరమిచ్చి అంతర్థానమయ్యారు. ఊయలలోని ఆ బాలురు అత్రి అనసూయలకు బిడ్డాలై కొంతకాలం పెరిగిన తరువాత! బ్రహ్మ, శివుడు వారి వారి అంశలను "దత్తనారాయణు"నికి ఇచ్చినారు. అప్పటి నుండి ఆ స్వామివారు "శ్రీ దత్తాత్రేయ" స్వామిగా అవతార లీలలు ఆరంభించినారు.

ఇట్టి అత్యంత పుణ్యప్రదమైన "శ్రీదత్తజయంతి"నాడు ఆ స్వామికి షోడషోపచార ములతో విశేష పూజలు భక్తులు జరిపి తమ జన్మలు చరితార్థం చేసుకున్నారు.

శ్రీ సుబ్రహ్మణ్య షష్ఠి

దేవేంద్రుడు మార్గశిర శుద్ధ షష్ఠినాడు దేవసేనతో "శ్రీ సుబ్రహ్మణ్యేశ్వర స్వామి" వారికి అత్యంత వైభవంగా వివాహము జరిపించిన ఈ రోజును "శ్రీ సుబ్రహ్మణ్య షష్ఠి" గా పరిగణిస్తారు. ఈ స్వామివారి జన్మవృత్తాంత విశిష్టత సమీక్షగా తెలుసుకుందాము! 

పూర్వం మూడులోకాలను భయభ్రాంతులను చేస్తూ బాధిస్తున్న "తారకా సురుడు" అను రాక్షసుని బారి నుండి రక్షణ పొందుటకై! దేవతలు బ్రహ్మదేవుని శరణువేడినారు. దానికి బ్రహ్మ వారికి ఒక సూచన చేసినారు. ఈ తారకాసురుడు అమిత తపోబలసంపన్నుడు, అమితబలశాలి, వీనికి ఈశ్వర తేజాంశ సంభవుని వల్లకాని వానికి మరణములేదు. కావున! మీరు సతివియోగ దుఃఖముతో ఉన్న ఈశ్వరునకు ఆ సతీదేవియే మరుజన్మయందు గిరిరాజు హిమవంతునకు పుత్రికగా అవతరించిన ఆ పార్వతీదేవికి వివాహం జరిపించండి. వారికి కలుగు పుత్రుడే తారకాసురుని సంహరించగల సమర్ధుడు అవుతాడు అని తరుణోపాయం శెలవిచ్చారు. 

అప్పటికే తపోదీక్షలో ఉన్న పరమశివునకు సేవలు చేస్తున్న ఆ జగన్మాత పార్వతికి, శివునకు అన్యోన్యత చేకూర్చే వాతావరణాన్ని కల్పించేందుకు! దేవతలు మన్మధుని ఆశ్రయిస్తారు. మొత్తం మీద మన్మధుని పూలబాణాలతో ఈశ్వరుని చలింపచేసి తాను ఈశ్వరుని ఆగ్రహానికి గురు అయినా! పార్వతి పరమేశ్వరుల కళ్యాణానికి మన్మధుడు కారణ భూతుడవుతాడు. కళ్యాణం అనంతరం దేవతల అభ్యర్ధనమేరకు పునర్జీవింపబడతాడు. 

ఇలా ఉండగా! పార్వతీ పరమేశ్వరులు ఏకాంత ప్రణయానందసమయాన అగ్నిదేవుడు పావురం రూపంలో వారి ఏకాంత మందిరంలోకి ప్రవేశిస్తాడు. అది గ్రహించిన పరమ శివుడు తన దివ్య తేజస్సును ఆ అగ్నిహోత్రునిలోకి ప్రవేశపెడతాడు. దానిని భరించలేక ఆ దివ్య తేజమును గంగానదిలో విడచి పెడతాడు. ఆ తేజము ఆ సమయమందు ఆ నదిలో స్నానమాడుచున్న షట్‌కృత్తికల దేవతల గర్భాన ప్రవేశిస్తుంది. ఆ రుద్రతేజమును వారు భరించలేక రెల్లుపొదలో విసర్జిస్తారు. అంత ఆ ఆరుతేజస్సులు కలసి ఆరుముఖాలతో ఒక దివ్యమైన బాలుడుగా ఉద్భవిస్తాడు. ఇది తెలిసిన పార్వతీ పరమేశ్వరులు రుద్రాంశ సంభూతునిగా ఆ షణ్ముఖుని అక్కున చేర్చుకుని కైలాసం తీసుకుని వెళతారు. 

ఆ బాలుడు గంగాగర్భంలో తేజోరూపంలో ఉన్నందుకు గాంగేయుడని, షట్‌కృత్తికలు వానిని పెంచి పెద్దచేసిన కారణం వల్ల మరియు ఆరుముఖాలు కలవాడు అగుటవల్ల షణ్ముఖుడని, కార్తికేయుడని, అతడు గౌరీశంకరుల పుత్రుడగుటచే కుమారస్వామి అనియు, సుబ్రహ్మణ్యస్వామి అనియు నామాలతో పిలువసాగిరి. 

కారణజన్ముడైన ఈ స్వామి పార్వతి పరమేశ్వరులు, దేవతలు కోరిక మేరకు కుమారస్వామిగా చేసి, వానిని దేవతల సర్వసైన్యాధ్యక్షునిగా నియమించి పరమేశ్వరుడు "శూలం" మొదలైన ఆయుధాలను ఇవ్వగా, ఆ జగన్మాత పార్వతి కుమారుని దీవించి "శక్తి" అను ఆయుధాలను ఇచ్చి సర్వశక్తివంతుడ్నిచేసి, తారకాసురునిపై యుద్ధ శంఖారావాన్ని మ్రోగిస్తారు. అంత ఆ స్వామి నెమలి వాహనారూఢుడై ఆరుముఖాలు పన్నెండు చేతులతో ఉగ్రరూపందాల్చి ఆరు చేతులతో ధనస్సులను మరో ఆరు చేతులతో బాణాలు ధరించి కొన్ని అక్షౌహిణులను సంహరించి, రాక్షస సేనను ఒకేసారి సంహరించాలని తలచి "సర్పరూపం" దాల్చి వారిని ఉక్కిరి బిక్కిరి చేసి, భీకర యుద్ధము చేసి తారకాసురుని సంహరించి విజయుడైనాడు. 

సర్వశక్తి స్వరూపుడైన ఈ స్వామికి దేవేంద్రుడు దేవసేనతో వివాహము జరిపిన ఈ రోజును "శ్రీ సుబ్రహ్మణ్యషష్ఠి"గా పరిగణిస్తారని, సర్వులకు పూజ్యనీయులైన శ్రీ వేదవ్యాసులవారు దీని విశిష్టతను వివరిస్తారు. 

ఈ సుబ్రహ్మణ్యేశ్వరస్వామి వార్కి గ్రామాలు, పట్టణాలు అనుబేధము లేకుండా దేశం నలుమూలలా దేవాలయాలు కలవు. ఈ రోజున "శ్రీవల్లి దేవసేనా సమేత శ్రీ సుబ్రహ్మణ్యేశ్వర స్వామి" వారికి భక్తులు కళ్యాణోత్సవములు, సహస్రనామ పూజలు తీర్ధములు అత్యంత వైభవంగా జరుపుతూ ఉంటారు. 

ఈ స్వామి ఆరాధనవల్ల నేత్రరోగాలు, చర్మవ్యాధులు తగ్గుతాయని; పెళ్లికాని వారికి వివాహం జరిగి సత్‌సంతాన సౌభాగ్యం కలిగి ఆయురారోగ్య ఐశ్వర్యములతో వర్ధిల్లు తారని ప్రజల విశ్వాసం. అలా సంతానం కలిగినవారు శ్రీ స్వామివారి సహస్రనామాలలో ఇష్టమైన పేరును వారి బిడ్డలకు పెట్టుకుంటారు. ఈ పుణ్యదినాన శ్రీ స్వామికి పాలు, పండ్లు, వెండి, పూలు పడగలు, వెండి కళ్ళు మొదలైన మొక్కుబడులు సమర్పించుకుంటూ ఉంటారు. 

ఇటువంటి పుణ్యప్రదమైన "శ్రీ సుబ్రహ్మణ్యషష్ఠి" నాడు మనమంతా శ్రీ స్వామి విశేష పూజలు గావించి శ్రీ స్వామివారి కృపాకటాక్ష వీక్షణలు పొందుదాము.

కేదారేశ్వర వ్రతము

కార్తీకమాసంలో కొన్ని ప్రాంతాలలో నవగ్రహ దీపాల నోమును కూడా నోస్తారు. ఈ నోములో నవగ్రహాలదే ప్రధాన తాంబూలం. కార్తీక మాసంలో మూడు రోజులపాటు ఈ నోమును యజ్ఞభావనతో చేస్తారు. ముందుగా గణపతి ఆరాధన చేసి, తరువాయి శివలింగార్చనచేసి, నవధాన్యాలను కొద్దికొద్దిగా తీసి వాటిపై దీప ప్రమిదలనుంచి ఓం నమ:శ్శివాయ మంత్రాన్ని నూట ఎనిమిది సార్లు స్మరిస్తారు. తరువాత అమ్మవారికి సంభంధించిన స్తోత్ర పారాయణ చేసి తొమ్మండుగురు బ్రాహ్మణులకు ఆ దీపాలను దానం ఇస్తారు. దానం చేసేటప్పుడు యధాశక్తి దక్షిణను మాత్రం నిండు మనసుతో సమర్పించాలి. ఈ నోము శుభతిధులలో సాయం వేళలలో మాత్రమే జరగాలి. నోము అనంతరం అక్షతలను గృహం ఈశాన్య భాగంలో కొద్దిగాచల్లి, కుటుంబంలో అందరూ శిరస్సుపై చల్లుకోవాలి.....ఈనోము తరతరాలుగా అనేక ప్రాంతాలలో జరుగుతోంది. ఇది సర్వ రక్షాకరంగా కుటుంబాన్ని కాపాడుతుందని భారతీయుల ప్రగాఢ విశ్వాసం. ఈ నోము ఫలితాలు కార్తీక మహాపురాణంలలో వివరంగా కన్పిస్తాయి. 

మరో ముఖ్య విశేషమేమంటే....కార్తీక మాసంలో శ్రీ రమాసహిత సత్యనారాయణ స్వామి వారి పుణ్య వ్రతాన్ని లక్షలాది కుటుంబాల్లో తప్పనిసరిగా జరిపిస్తారు. ఈ పుణ్యదినాలలో ఈ వ్రతం ఆచరించడంవల్ల సర్వ భోగభాగ్యాలు శ్రీ సత్యనారాయణ స్వామి కటాక్షంగా లభిస్తాయని హిందువుల ప్రగాఢ విశ్వాసం. ఆంధ్ర ప్రాంతీయులకంటే తెలంగాణా ప్రాంతాలలో ఈ వ్రతాచరణ ఒక విధి విధానమవ్వడం, ఆచరించే విధానంలో వుండే పద్ధతులు ఆశ్చర్యపరుస్తాయి. కొన్ని ప్రాంతాలలో శ్రీ కేదారశ్వరస్వామి వారి వ్రతాన్ని ఈ మాసంలోనే జరపడం మరో విశేషం.ఉత్తర భారతదేశంలో ఈ మాసంలో బిల్వపత్ర వ్రతాన్ని జరిపిస్తారు. ఇంటింటా లక్షలాది మారేడు దళాలతో ఈ మాసం పవిత్రమౌతుంది. శక్తి ఉన్నవారు స్వర్ణ బిల్వపత్రాలను చేయించి తొమ్మిది రోజులు శివసన్నిధిలో ఉంచి బ్రాహ్మణోత్తములకు లేదా వృద్ధ ముత్తయిదువులకు దానమిచ్చి బిల్వాష్టకమును పారాయణ చేస్తారు. 

ఏ ఏ ప్రాంతాలలో ఏ ఏ దానాలు చేసినా, వ్రతాలు చేసినా కార్తీక వైభోగం కార్తీక వైభోగమే ! 'ఒక్క బిల్వాన్ని శివుడికి అర్పి స్తే చాలు!జన్మ ధన్యమౌతుంది' ఒక్క పొద్దు ఉపవాసముంటే చాలు! కైలాసవాసం ప్రాప్తిస్తుంది. ఒక్క దీపాన్ని దానమిస్తే చాలు ! జీవితం ఐశ్వర్యమయమౌతుంది'.... ఇలా అనేక నమ్మకాలతో మనస్సు పవిత్రమయంగా పరమేశ్వ్ర సేవలో లగ్నమౌతుంది. 

కొరతలేని జీవనానికి కార్తీక మాసంలో మహేశ్వరుణ్ణి మనసారా ఆరాధించండి. కార్తీకమాస పుణ్యవ్రతాలను మంగళప్రదంగా ఆచరించండి. శివతత్త్వాన్ని గృహంలో ప్రతిష్టించండి. కార్తీక పురాణ కధలను పదిమంది ముందు పఠించండి. భక్తికి ప్రాధాన్యత ఇస్తూ అర్ధనారీశ్వర చైతనాన్ని హృదయంలో నింపుకోండి. ఆ ప్రార్ధనాశక్తి ఆవిర్భవింపచేసే మహాతేజస్సు శివం...శివం....అంటూ హృదయాన్ని ప్రకాశింపచేస్తుంది. ఆ వెలుగును వర్ణించడానికి మాటలు అందవు. అది అఖండం...అపూర్వం...అమోఘం.... 

ఇదే వ్రతం ఫలం....జన్మజన్మాల పుణ్యఫలం...

తులసి పూజ - తులసి ప్రాశస్త్యమ్‌


శ్లో|| యన్మూలే సర్వతీర్ధాని యన్మధ్యే సర్వదేవతా

య దగ్రే సర్వవేదశ్చ తులసీం త్వా నమామ్యహమ్‌ ||

శ్రీ మహాలక్ష్మీ నారాయణ స్వరూపిణియైన "తులసి" యొక్క మూలంలో సర్వతీర్ధాలు, మధ్యభాగమందు సమస్త దేవతలు, తులసిమొక్క పైభాగమున సర్వవేదాలతో కొలువైవున్న తులసి మాతకు ముందుగా నమస్కరించుకుని, అంతటి పూజ్యనీయమైన ఆ తులసి ఆవిర్భావ చరిత్ర-తులసి ప్రాశస్త్యమును గూర్చి, మన పురాణములలో ఎన్నో కధలు కానవస్తున్నాయి. వాటిలో ఒకగాధను సమీక్షించుకుందాం!

"బ్రహ్మవైవర్తపురాణ"మందు గల తులసి వృత్తాంతము ఇలా ఉన్నది. ధర్మధ్వజుడు, మాధవి అను దంపతులకు అతిలోక సౌందర్యవతియైన కుమార్తై కలిగినది. వారు ఆ బిడ్డకు "బృంద" అను నామకరణము చేసుకుని అల్లారు ముద్దుగా పెంచుకోసాగిరి. ఆమెకు వివాహవయస్సురాగనే శ్రీహరిని వివాహమాడతలచి బదరికాశ్రమము జేరి బ్రహ్మనుగూర్చి ఘోరముగ తపమాచరించినది. బ్రహ్మదర్శన మిచ్చి నీ కోరిక ఏమిటో చెప్పుమనగా "నేను రాధాశాపముతో నున్న రుక్మిణిని, నాకు శ్రీకృష్ణుడే భర్తగా పొందుటకు"- వరమీయమని ప్రార్ధించినది.

అందులకు బ్రహ్మ ! నీ కోరిక తప్పక నెరవేరగలదు. కాని! ముందుగా గోలోకనివాసి సుదాముడే ముందుగా నీకుభర్త కాగలడు, అనంతరమే నీవు కోరిన వాడే నీకు పతియగును అని వరమిచ్చి అంతర్ధానమయ్యెను.

ఇలా ఉండగా బ్రహ్మదేవుడు చెప్పిన సుదాముడు పుష్కరకాలము శాపకారణముగా భూలోకమున శంఖచూడుడై జన్మించి తపమాచరించసాగెను. అతని తపస్సునకు మెచ్చి బ్రహ్మ ఏమివరము కావాలో కోరుకోమన్నాడు. అంత శంఖ చూడుచు "లక్ష్మీభూలోకమున పుట్టినదట! నాకామెతో వివాహాము చేయించమని వేడుకొనెను" బ్రహ్మ 'తధాస్తు' అని పలికి ఆమె బదరికాశ్రమమున నున్నది. ఆమె నీకు తప్పక లభ్యముకాగలదు అని యంతర్ధానమందెను. అనంతరము శంఖ చూడుడు బృందవాద ప్రతి వాదములను గమనించి అప్పుడు వార్కి మరల బ్రహ్మ ప్రత్యక్షమై వారి వారి అభీష్టములు నెరవేరుటకు వార్కి వైభవముగా వివాహము గావించెను.

ఇక శంఖచూడునకు లక్ష్మీయంశతో నున్న భార్య లభ్యమగుసరికి! అష్ట్తెశ్వర్యము లతో తులతూగుచూ అతిసమయము పెంచుకుని స్వర్గాధిపత్యము పొందగోరి దేవరాజ్యమును కొల్లగొట్టి; దేవతలను పలు ఇక్కట్లు పాలు చేయుటయే కాకుండా; పరమేశ్వరుని చెంతకేగి, శివా! నీ భార్య సుందరాంగి. అమెను నాకు వశ్యురాలును చేయుము లేనిచో యుద్ధమునకు తలపడమని ఘోరముగా శివునితో యుద్ధము చేయసాగెను. వెంటనే శ్రీహరి వారిని సమీపించి "శివా! వీడు అజేయుడు అగుటకు కారణం! ఈతని భార్య మహాపతివ్రత. ఆమె పాతివ్రత్య భంగము నేనాచరించదను. నీవు వీనిని వధించుము." యని యుక్తి చెప్పెను.

అనంతరము మాయా శంఖచూడుని వేషము ధరించి యున్న శ్రీహరిని చూచి బృంద తన భర్తే వచ్చినాడని భ్రమించి! ఆతనికి సర్వోపచారములుచేసి శ్రీహరి చెంతకు చేరగానే! ఆమె పాతివ్రత్యము భగ్నమగుట గ్రహించి శివుడు శంఖచూడుని సంహరించగా! నాతడు దేహమును విడచి "సుదాముడై" గోలోకమునకు పోయెను. బృంద తన ఎదుట ఉన్నది మాయా శంఖచూడుడని గ్రహించి శ్రీహరిని "శిలారూప మందుదువుగాక" యని శపించగా! తిరిగి ఆమెను నీవు "వృక్షమగుదువుగాక" యని శపించెను. ఆవిధంగా శ్రీహరి గండకీనదిలో సాలగ్రామ శిలగాపుట్టి; బృంద తులసీ వృక్షమై పోయి ఇద్దరూ ప్రపంచముచే పూజనీయస్వరూపములు పొందినట్లుగా బ్రహ్మవైవర్త పురాణగాధ ద్వార విదతమగుచున్నది.

ఒకసారి పరమేశ్వరుడు కుమారుడైన కుమారస్వామిని చెంతకుం చేర్చుకుని; పుత్రా!

"పుత్రా! సకల వృక్షములలోన తులసియొక్కటయే

పూజ్యమైక క్ష్మారుహంబు దాని పత్రములను దాని

పుష్పములను బ్రాణ సమములగును అచ్యుతనకు."

మరియు వృక్షాలన్నిటియందు తులసి శ్రేష్ఠమైనది, శ్రీహరికి ఇది అత్యంత ప్రీతిపాత్రమైనది. "తులసిపూజ" తులసీ స్త్రోత్రం చదవడం, తులసి మొక్కలో పోసిన నీటిని శిరస్సున జల్లుకోవడం, తులసీవనమును పెంచి వాటి మాలలు శ్రీహరికి సమర్పించుట ఎంతో! పుణ్యప్రదమైనవి. గోదాదేవి తులసీవనంలోనే అయోనిజగా విష్ణుచిత్తునింట వెలసి శ్రీరంగనాధుని ఇల్లాలయింది.

శ్లో|| వశిష్ఠాది ముస్తోమై: పూజితో తులసీవనే

తదా ప్రభృతి యద్విష్ణు : బ్రతిజ్ఞాం కృతవాన్‌ ప్రభు:

తస్మిన్‌ తులస్యాంతు య: పూజాంకురు తేనర:

సర్వపాప వినిర్ముక్త : మమసాయుజ్య మాప్నుయాత్.

వశిష్ఠాది మునిగణముచే ఎన్నో విధములుగా స్తోత్రపూర్వకముగా శ్రీహరి తులసీ వనమందు పూజలందుకొని నన్ను "కార్తీక శుద్ధద్వాదశి" నాడు విశేషించి ఎవరు బూజచేయుదురో! అట్టివారి సమస్తయొక్క పాపములు అగ్నిలోపడిన మిడుతలు వలె భస్మమయి వారు తప్పక నా సాన్నిధ్యమును పొందుదురని ప్రతిజ్ఞ చేసెనట!

శ్లో|| తులసీవ్రత మహాత్మ్యం శ్రోతవ్యం పుణ్యవాంచ్చిన:

యదిచ్చేద్విష్ణు సాయుజ్యం శ్రోతవ్యం బ్రాహ్మ్ణ్తణ్తెస్సహ

విష్ణో : ప్రీతిశ్చ కర్తవ్యా శ్రోత వ్యాతులసీకధా

ద్వాదశ్యాం శ్రవణాత్తస్యా: పునర్జన్మ న విద్యతే.

విష్ణు సాన్నిధ్యముగోరి విష్ణుదేవునకు యేమాత్రమైన ప్రీతి జేయవలయునునని తలచేవారు తులసీ వ్రతమహాత్మ్యము తప్పక వినవలయును. అందునా! ఆ వ్రత కధను "క్షీరాబ్ధిద్వాదశి" రోజున తులసీ కధ వినువార్కి, చదువువార్కి, పూర్వజన్మ కృతమైన దు:ఖములన్నియు తొలగిపోయి విష్ణులోకమును పోందుదురు, అని శంకరునిచే "తులసి" కొనియాడబడినట్లు చెప్పబడినది. అట్టి తులసీ బృందావన మందు ఉసిరిమొక్కతో కలిపి "తులసీధాత్రీ సమేత శ్రీమన్నారాయణుని" ఈ కార్తీక ద్వాదశినాడు పూజించుట ఎంతో విశిష్టమైనదిగా పేర్కొనబడినది. మరియు అట్టి తులసీ దళములకు "నిర్మాల్యదోషం" పూజలో ఉండదని కూడా చెప్పబడినది.

కావున! మన హిందూమతంలో "తులసి" ఆధ్యాత్మిక దృష్టిలో విశిష్టమైన స్ధానాన్ని పొందింది. తులసిమొక్క హిందువులకు పూజనీయమైనది. కావున హిందువులు ప్రతిఇంటా తులసి మొక్కను కోటలో పెంచి పూజించుట మనం చూస్తూ ఉంటాము. ఇక పట్టణావాసులైతే అంతలో కొంత జాగా ఏర్పరచుకుని, చిన్నచిన్న కుండీల్లోనో, డబ్బాల్లోనో పెంచి పూజిస్తూ ఉంటారు. కావున 'తులసి' ఉన్న ఇల్లు నిత్యకళ్యాణము పచ్చతోరణంతో శోభిల్లుతూ ఉంటుంది.

ఇక ఈ తులసిని వైద్యపరంగా కూడా చూస్తే! ఆయుర్వేద శాస్త్రంలో 'సప్తతులసి-భరతవాసి' అంటూ తులసిని ఏడువిధాలుగా వివరించబడినది. అవి: 1.కృష్ణ తులసి 2. లక్ష్మీతులసి 3.రామతులసి 4. నేల తులసి 5. అడవి తులసి 6. మరువ తులసి 7.రుద్రతులసిగా వివరుస్తారు. వైద్యపరంగా వాటి అన్నిటికి ఎన్నో అమోఘమైన ఔషధగుణాలతో కూడి ఉంటాయని ఆయుర్వేద శాస్త్రం కొనియాడుతోంది. ప్రతిరోజు ఉదయం రెండు తులసి ఆకులు (కోటలోవికాదు) విడిగా పెంచుకున్న మొక్కలనుండి నమలి మింగితే వార్కి బుద్ధిశక్తి, జ్ఞాపకశక్తి పెరుగుతుంది. మరియు అనేక మానసిక రుగ్మతలు నయమవుతాయని; ఇలా ఎన్నో విశేష గుణాలను చెప్తారు.ఇక దాని కాండముతో తయారుచేయబడ (తులసిమాల)కు ఇటు ఆధ్యాతికపరంగా అటు ఆరోగ్యపరంగా ఎన్నోలాభాలు ఉన్నాయిట !

కావున ఈ "క్షీరాబ్దిద్వాదశి" వ్రతాన్ని ఆచరించి ఇటు ఆధ్యాత్మిక సంపదతో పాటు ఆరోగ్య భాగాన్ని సర్వులమూ పొందుదాం!